E20 పెట్రోల్ బంద్ చేస్తారా లేదా.. 2 లక్షల మంది సంతకాలతో నడి రోడ్డుపై కేజ్రీవాల్ బైఠాయింపు

E20 పెట్రోల్ బంద్ చేస్తారా లేదా.. 2 లక్షల మంది సంతకాలతో నడి రోడ్డుపై కేజ్రీవాల్ బైఠాయింపు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. E20 పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరారు. మాజీ మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, ఇతరులతో కలిసి దేశవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది సంతకాలు చేసిన వినతి పత్రాన్ని ప్రధాని మోడీకి అందజేసేందుకు బయలుదేరారు. 

ఈ క్రమంలో ఫిరోజ్ షా రోడ్డు మార్గంలో కేజ్రీవాల్‎ను పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా ప్రధాని మోడీ ఇంటి వైపు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులు, ఆప్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. తాము శాంతియుతంగా ప్రధానికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్నామని.. తమను అడ్డుకోవద్దని కేజ్రీవాల్ కోరారు. కానీ పోలీసులు ఇందుకు నిరాకరించారు. దీంతో మనీష్ సిసోడియా, ఆప్ నాయకురాలు జాస్మిన్ షా, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేజ్రీవాల్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే E20 పెట్రోల్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా సంతకాలు చేసిన వినతి పత్రాన్ని ప్రధాని మోడీకి అందజేసేందుకు ఆయన నివాసానికి వెళ్తున్నామని తెలిపారు. E20 పెట్రోల్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కోట్లాదిమంది వాహన యజమానుల ఆందోళనలను ప్రభుత్వం వినాలని కోరారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా దేశంలో కోట్ల వాహనాలు దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

E20 పెట్రోల్ తో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం వారి గోడు ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితోనే ప్రధాని మోడీ దేశ ప్రజలపై ఇథనాల్‌ను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. అమెరికాలోని వ్యర్థ ఇథనాల్‎ను ఇండియాకు దిగుమతి చేస్తున్నారని.. దేశ ప్రజలను మోసం చేయడం సరికాదని చురకలంటించారు. నీట్ కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన సమయంలో కూడా ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరించిందని.. కానీ చివరకు సర్కార్ తలొగ్గక తప్పలేదన్నారు.