ఆధ్యాత్మికం: గుడిలో ప్రదక్షిణాలు ఎందుకుచేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి .. ఎలాంటి ఫలితం కలుగుతుంది.!

ఆధ్యాత్మికం:  గుడిలో ప్రదక్షిణాలు ఎందుకుచేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి .. ఎలాంటి ఫలితం కలుగుతుంది.!

హిందువులు చాలామంది వారానికొకసారి ఇష్ట దైవం కొలువుండే దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేసిన తరువాత మూల విరాట్​ ను దర్శించుకుంటారు.  దేవాలయానికి వెళ్లినప్పుడు ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి.  ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. అలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . ! 

హిందువులు కొంతమంది రోజూ గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటే.. మరికొంతమంది వారానికో.. నెలకో లేదా ఏదైనా విశేషమైన రోజుల్లో దేవాలయాలకు వెళతారు.  అయితే దేవాలయానికి వెళ్లిన తరువాత గుడి చుట్టూ తిరుగుతారు.  దీనినే ప్రదక్షిణం అంటారు.  అయితే ప్రదక్షిణాలు ఎలా పడితే అలా చేయకూడదు. పురాణాల ప్రకారం కొన్ని నియమాలున్నాయని పండితులు చెబుతున్నారు. 

దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించేసమయంలో విగ్రహాల కింద కొన్ని శక్తివంతమైన యంత్రాలను ప్రతిష్టిస్తారు.  ఈ యంత్రాల ద్వారానే విగ్రహాలకు శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు.  యంత్రాలపై బీజాక్షరాలు ఉంటాయి,  ఒక్కో వైపు ఒక్కో బీజాక్షరం ఉంటుంది.. ఒక్కొక్కటి ఒక్కో శక్తి  కలిగి ఉంటుంది.  మనం ఇంట్లో పూజ చేసినా... చేయకపోయినా దేవాలయంలో కచ్చితంగా పూజలు జరుగుతాయి కాబట్టి శక్తి పెరుగుతుంది.  ఇక ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. .

ఖగోళ శాస్త్రం ప్రకారం .. సూర్యుడి చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తోంది. భూమి తనకంటే పెద్ద శక్తి కలిగిన  సూర్యుడికి ఉంది కనుక ప్రదక్షిణ చేస్తుంది. ఆకర్షణ ఎక్కడ శక్తి ఉంటుందో ఆ శక్తి చుట్టూ ఇతరులంతా కూడా ఆకర్షణతో వస్తారు కదా.  భూమి చుట్టూ చంద్రుడు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఇది కూడా ఆకర్షణే. 

ఆలయ ప్రాంగణంలో కొంత దైవశక్తి ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు.  పెద్ద శక్తి కలిగిన ఆలయానికి వెళ్లినప్పుడు  ఆ దైవం చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటా రు.  మన మనసు దైవం. ఈ జ్ఞానం కలవారు చేసేటటువంటి ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణగా చెబుతారు.

ప్రదక్షిణలు ఎలాచేయాలి

 తూర్పున నిల్చొని పడమర వైవుగా ఉండే ఆ దైవాన్ని తూర్పు ముఖంగా ఉన్నట్లుగా చూచి మనం మన ఎడమ చేతి వైపుగా నడక ప్రారంభిస్తాం. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం ఇలా పూర్తి చేస్తాం. ఇలా తిరగడం ప్రదక్షిణ అనుకున్నప్పుడు కనీసంలో కనీసంగా సమస్త ఆలయాలకు 3 ప్రదక్షిణలు చేయాలని చెబుతున్నారు. సత్వ రజస్తమో గుణాలకు ఈ ప్రదక్షిణలు ప్రతీక. గత జన్మము, వర్తమాన జన్మము, భవిష్యత్ జన్మమునకు కూడా ఈ మూడు ప్రదక్షిణలు ప్రతీక అని చెబుతున్నారు.

►ALSO READ | ఆధ్యాత్మికం : ధర్మదీపం.. జీవితం ఏమిటి.. ఎన్నాళ్లు మోస్తావు?

నవగ్రహ మంటపానికి తొమ్మిది, రావిచెట్టు-వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో  27 ప్రదక్షిణలు చేయాలి. జమ్మి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. సంతాన క్షేమం కోరేటటువంటివారు రాగి చెట్టు-వేప చెట్టు కలిపిన చోట ప్రదక్షిణ చేస్తారు. ఆ చెట్టు వల్ల లభించే గాలి వీరిలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. ఆశావహ దృక్పథాన్ని కూడా పెంపొందిస్తుంది. కనుక ప్రదక్షిణలు ఎప్పుడూ మంచివే అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

ప్రదక్షిణ  నియమాలు ఇవే

  •   ప్రదక్షిణను భగవంతుడిని భక్తితో స్మరించుకోవాలి
  •  ప్రదక్షిణ చేసే సమయంలో మౌనంగా ఉండాలి. నెమ్మదిగా నడవాలి. పరిగెత్తకూడదు. పక్కచూపులు చూడకూడదు.
  • తలవంచుకొని పాదాల మీద మాత్రమే దృష్టి పెట్టాలి.
  •  మంత్రాన్ని మనసులో జపం చేస్తూ నెమ్మదిగా నడవాలి. 
  • రెండు చేతులలో కూడా జపమాల, పుష్పములు పట్టుకోవాలి. లేని యెడల రెండు చేతులు జోడించి పట్టుకోవాలి. అంతేకానీ, వాకింగ్ కు  పోయినట్లుగా వెళ్లకూడదు.
  •   నేటి కాలంలో కొందరు వాకింగ్ అన్న పేరిట..  పూర్వకాలంలో రుషులు ప్రదక్షిణలు చేయాలని చెప్పేవారు.
  • ఆధ్యాత్మికపరమైన ఆలోచన వేరు, దైహిక పరమైన ఆధునిక దృష్టి వేరుగా ఉంటుంది.
  • వాకింగ్ చేసే సమయంలో కొద్దిగా పెద్ద అడుగులు వేయాలి. అలాగే, చేతులు బాగా దూరంగా ఊపాలి. సైనికుల వలే మనం నడక నడవాలి. ఇందువల్ల ఆరోగ్యం చేకూరుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకం ప్రదక్షిణ చేసే విధానం. నెమ్మదిగా నడవాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. ఇదే ప్రదక్షిణలో దాగి ఉన్న నేపథ్యమని చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.