UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు.. మర్చంట్ పేమెంట్స్‌పై అదనపు భారం!

UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు.. మర్చంట్  పేమెంట్స్‌పై అదనపు భారం!

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ పేమెంట్ విధానమైన UPI ద్వారా పేమెంట్స్ స్వీకరిస్తున్న వ్యాపారులపై కొత్త ఛార్జీల విధానం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రతిపాదన ప్రకారం.. వ్యాపార సంస్థల వద్ద జరిగే పెద్ద యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.

MDR అంటే డిజిటల్ చెల్లింపు సేవలను అందించినందుకు వ్యాపారులు.. బ్యాంకులు, పేమెంట్ సంస్థలకు చెల్లించే కమిషన్. ప్రతిపాదిత రేటు సుమారు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ప్రతి రూ.100 యూపీఐ చెల్లింపుపై సుమారు 25 పైసలు అన్నమాట. అదే రూ.10వేలు లావాదేవీపై రూ.25 వరకు కమిషన్ చెల్లించాల్సి రావచ్చు. అయితే ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారుల యూపీఐ చెల్లింపులకు కాకుండా.. బిజినెస్ పీపుల్ అకౌంట్లకు జరిగే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే వర్తించే అవకాశం ఉంది.

ఈ మార్పు ముఖ్యంగా పెద్ద వ్యాపార సంస్థలు, అధిక విలువైన లావాదేవీలు చేసే మర్చంట్లకు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ రకమైన వ్యాపారాలకు, ఎంత మొత్తం దాటిన లావాదేవీలకు MDR వర్తించాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా చర్చిస్తోందని సమాచారం. 2020కు ముందు యూపీఐ లావాదేవీలపై MDR అమల్లో ఉండేది. డిజిటల్ చెల్లింపులను వేగంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అప్పట్లో జీరో MDR విధానాన్ని తీసుకొచ్చింది. అయితే యూపీఐ పేమెంట్స్ భారీగా పెరగడంతో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు వచ్చే ఆదాయానికి గండి పడుతుండటంతో ఛార్జీల మోతకు మోడీ సర్కార్ సిద్ధం అవుతోంది.

రూ.2వేలకు పైబడిన మర్చంట్ లావాదేవీలపై 25 బేసిస్ పాయింట్ల MDR విధిస్తే సంవత్సరానికి సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ ఆదాయం బ్యాంకులు, పేమెంట్ సంస్థలు, డిజిటల్ పేమెంట్ వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడొచ్చని అభిప్రాయం. ప్రస్తుతం దేశంలోని డిజిటల్ లావాదేవీల్లో సుమారు 88 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి నెలా 2వేల300 కోట్లకు పైగా లావాదేవీలు, దాదాపు రూ.30 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరింత మంది వినియోగదారులను చేరుకోవాలంటే యూపీఐ వ్యవస్థకు స్థిరమైన ఆదాయ మార్గాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే జరిగితే వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపుల నుంచి తిరిగి క్యాష్ పేమెంట్లకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.