హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర పరిధిలో నిర్మాణ, కూల్చివేత, వ్యర్థాల అక్రమ డంపింగ్‌ను అరికట్టేందుకు గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జచేష్ రంజన్ స్పెషల్గైడ్లైన్స్తో జీవో విడుదల చేశారు. రోడ్లు, డ్రెయిన్లు, నాలాలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో సీ అండ్ డీ వ్యర్థాలను పారవేయకూడదు.
ఈ రూల్ బ్రేక్చేస్తే ఫైన్లతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. అనుమతులను కూడా ఉపసంహరించుకుంటారు. కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. 20 వేల చదరపు మీటర్లకు పైబడిన నిర్మాణ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనుల్లో ప్రాసెస్ చేసిన సీ అండ్ డీ వ్యర్థాలను ఖచ్చితంగా వినియోగించాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ పనుల్లో కనీసం 10 శాతం నిర్మాణ సామగ్రిని సీ అండ్ డీ వ్యర్థాలతో తయారైన ఉత్పత్తుల నుంచే వినియోగించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. శంషాబాద్, తూముకుంట, జీడిమెట్ల, ఫతుల్లగూడ ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన సీ అండ్ డీ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలకు మాత్రమే వ్యర్థాలను తరలించాలని ఆదేశించింది.
