దర్శకుడిగా వరుస ఎంటర్‌టైనర్స్ తెరకెక్కిస్తున్న త్రినాథరావు నక్కిన.. నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘అనకాపల్లి’. కాండ్రేగుల నాయుడుతో కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్‌లో నటించగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించాడు. ఆగస్టు 7న సినిమా విడుదల సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను గురించి వివరించారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఇదొక టౌన్‌లో జరిగే లవ్ స్టోరీ. ప్రస్తుత యువతరానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కనెక్ట్ చేసేలా సందేశాత్మకంగా దీన్ని తెరకెక్కించాం. ఇందులో యాక్షన్ ఎక్కువగా ఉన్నా, ఫ్యామిలీ డ్రామా డామినేట్ చేస్తుంది. దర్శకుడు, హీరో పట్టుబట్టి ఇందులోని తండ్రి పాత్రకు నన్ను ఒప్పించారు. ఈ చిత్ర దర్శకుడు ఖగేష్ నాకు పదేళ్లుగా తెలుసు. సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు’ అని చెప్పారు. మరో నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ ‘నాది, త్రినాథరావుది అనకాపల్లి. సొంత ఊరిలో షూట్ చేయడంతో అంతా సపోర్ట్ చేశారు. నేచురల్ లొకేషన్స్‌లో తీయడం వల్ల అవుట్‌పుట్ మరింత ఎఫెక్టివ్‌గా వచ్చింది. యాక్షన్‌తో పాటుగా కుటుంబ విలువలు చెప్పే గొప్ప సందేశం ఉన్న చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి” అని చెప్పారు.
