భారత్లో అధిక ఆదాయం పొందుతున్న ఉద్యోగులపై పెరుగుతున్న పన్నుల భారం గురించి మరోసారి నెట్టింట చర్చ జరుగుతోంది. ఏడాదికి రూ.కోటి 75లక్షలు శాలరీ పొందిన ఓ ఉద్యోగి తన ఆదాయంలో రూ.57లక్షల 60వేలు ఇన్కమ్ టాక్స్, సర్చార్జ్, సెస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చిందని వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇండియాలో ఎంత కష్టపడినా ప్రయోజనం కనిపించడం లేదని.. ప్రతి ప్రమోషన్, ప్రతి శాలరీ హైక్, అదనంగా సంపాదించిన ప్రతి రూపాయి చివరికి అధిక పన్ను చెల్లించడానికే దారి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
దేశం వీడాలనే ఆలోచన..
భారీ పన్నుల కారణంగా ఇక పూర్తి స్థాయి ఉద్యోగాన్ని వదిలి కన్సల్టెన్సీ వైపు వెళ్లాలని, భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి పనిచేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదని, అధిక ఆదాయం పొందుతున్న వేలాది మంది నిపుణులు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. "ఎక్కువ కష్టపడి సంపాదిస్తే ప్రభుత్వం శిక్షిస్తున్నట్టేనా? లేక కష్టానికి తగిన ప్రోత్సాహం ఇస్తుందా?" అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
Earned ₹1.75 crore,but ₹57.60 lakh went straight to taxes.
— Pooja (@poojaofficial5) July 30, 2026
Now this guy says,
"At some point, working harder just does not feel worth it anymore."
Every promotion
Every salary hike
Every extra rupee
No longer feels like a reward
it simply means paying more Income Tax,… pic.twitter.com/qrKLZ9s27Y
పన్నులు ఎక్కువ... ప్రయోజనాలు ఎక్కడ?
39 శాతానికి పైగా పన్ను చెల్లిస్తున్నప్పటికీ, అందుకు తగ్గ సామాజిక భద్రత లేదా ప్రభుత్వ సేవలు అందడం లేదని విమర్శించారు సోషల్ మీడియాలో స్పందించిన పలువురు నెటిజన్లు. రిఫండ్ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, పన్ను చెల్లింపుదారుల సమస్యలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు. దీంతో ప్రతిభావంతులైన ఉద్యోగులు విదేశాలకు వెళ్లే ఆలోచన చేయడం ఆశ్చర్యం కలిగించటం లేదని అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనతో భారతదేశంలో ఆదాయపు పన్ను విధానంపై మరోసారి సంస్కరణల అవసరం ఉందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడే ఉద్యోగులు, మధ్యతరగతి, అధిక ఆదాయం పొందుతున్న వృత్తి నిపుణులకు మరింత సమతుల్యమైన పన్ను విధానం అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఆదాయం సమీకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. మరోవైపు కష్టపడి సంపాదించే వారిలో నిరుత్సాహం కలిగించే విధంగా పన్ను విధానాలు ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అధిక పన్నుల భారం కారణంగా నైపుణ్యం కలిగిన భారతీయులు విదేశాల వైపు మొగ్గుచూపితే, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చాలా మంది హెచ్చరిస్తున్నారు.
