ఒకప్పుడు హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి కేవలం నటుడిగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా తీసుకుని కమ్‌బ్యాక్‌కు సిద్ధమయ్యాడు. కథకు అనుగుణంగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (జూన్ 19, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై స్వయంగా నవీన్ నిర్మించిన ఈ సినిమాకు కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించాడు. ఎంతోకాలంగా వడ్డే నవీన్ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? హీరోగా నవీన్ తన కమ్‌బ్యాక్‌తో మళ్లీ మెప్పించగలిగాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
నిజాయితీకి మారుపేరైన కానిస్టేబుల్ త్రిమూర్తులు తరచూ బదిలీలు ఎదుర్కొంటూ తన విధులు నిర్వర్తిస్తుంటాడు. ఓ బదిలీ కారణంగా తన తండ్రి పనిచేసిన పాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతనికి, ఏళ్ల క్రితం జరిగిన గిరిజన యువతి ప్రియమ్మ అత్యాచార కేసుకు సంబంధించిన ఫైల్ దొరుకుతుంది. ఆ కేసు వెనుక హోమ్ మంత్రి కమల కుమారుడు సంతోష్ బాబు ఉన్నాడని తెలుసుకున్న త్రిమూర్తులు, తన తండ్రి అసంపూర్తిగా మిగిలిపోయిన పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రియమ్మకు న్యాయం చేయడానికి ఎలా పోరాడాడన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:
సుమారు పదేళ్ల విరామం తర్వాత హీరోగా తిరిగి వచ్చిన వడ్డే నవీన్, ఈసారి కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా భుజాన వేసుకుని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, రాజకీయ ప్రభావం, పోలీస్ వ్యవస్థలోని ఒత్తిళ్లు వంటి అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవిస్తూ కథను రూపొందించారు.
ALSO READ : Maa Inti Bangaram Review
సినిమా స్టార్టింగ్ లోనే ప్రియమ్మ ఘటనతో కథలో సీరియస్ టోన్ నెలకొంటుంది. ఆ తర్వాత త్రిమూర్తులు పాత్ర పరిచయం, అతని నిజాయితీ కారణంగా ఎదురయ్యే బదిలీలు, కుటుంబ సభ్యుల మద్దతు వంటి అంశాలను చూపిస్తూ కథ ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ, ఫ్యామిలీ సన్నివేశాలతో కథ నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ దగ్గర నుంచి ఆసక్తి పెరుగుతుంది.
సెకండ్ హాఫ్‌లో త్రిమూర్తులు తన తండ్రికి సంబంధించిన పాత ఫైల్‌ను కనుగొనడం, దాని వెనుక ఉన్న రాజకీయ కుట్ర బయటపడటం వంటి అంశాలు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. హీరో అన్యాయానికి ఎదురు నిలిచే విధానం, తండ్రి చివరి కోరికను నెరవేర్చాలనే పట్టుదల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు ఊహించదగ్గ విధంగా సాగడం, స్క్రీన్‌ప్లేలో మరింత బిగుతు ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రభావం చూపినా, మరికొన్ని చోట్ల డ్రామా ఎక్కువైన భావన కలుగుతుంది.
ALSO READ : సోమవారం కోర్టుకు రండి
ఎవరెలా నటించారంటే:
త్రిమూర్తులు పాత్రలో వడ్డే నవీన్ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత తెరపై కనిపించినా, పాత్రకు అవసరమైన హావభావాలతో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ, డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఇబ్బందిపడ్డట్లుగా కనిపిస్తుంది. రాశి సింగ్ తన గృహిణి పాత్ర పరిధి మేరకు మెప్పించగా, దేవీ ప్రసాద్, శిల్పా తులస్కర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
వడ్డే నవీన్ సినిమాలు గుర్తుచేసుకుంటే..
90-2000వ దశకంలో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. ఫ్యామిలీ, రొమాంటిక్ కథా చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా 'పెళ్లి', 'కోరుకున్న ప్రియుడు', 'స్నేహితులు', 'మనసిచ్చి చూడు', 'చాలా బాగుంది', 'నా హృదయంలో నిదురించే చెలి', 'ప్రేమించే మనసు', 'మా బాలాజీ', 'బాగున్నారా' వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
అనంతరం సినిమాలకు కొంత విరామం ఇచ్చిన వడ్డే నవీన్, చివరిసారిగా 2016లో వచ్చిన 'ఎటాక్' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాతో హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో ఆయన కమ్‌బ్యాక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఫస్ట్ డే టాక్ & వచ్చే వసూళ్లని బట్టి తెలిసిపోతుంది.
