- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: చేనేత కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇటీవల చేనేత పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన పాలకవర్గ సభ్యులు మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని, నేతన్నల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
నేతన్నల చిరకాల కోరిక అయిన యారన్ డిపోను వేములవాడలో రూ.50 కోట్లతో ఏర్పాటు చేసి చేనేత రంగానికి ఊపిరి పోశామన్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తాటికొండ రాజయ్య, కార్యదర్శి పారవెల్లి రాజేశం, ట్రెజరర్ రాపెల్లి దేవదాసు ఉన్నారు. అంతకుముందు పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ అధ్యక్షుడు తుమ్ మధు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
