భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బ తిన్న లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై పునరుద్ధరణ పనులు పూర్తిగా పూర్తయ్యే వరకు టోల్ వసూలును నిలిపివేస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. వాహనాల రాకపోకల కోసం ఇటీవల తెరిచిన కొద్ది వారాలకే అనేక పగుళ్లు కనిపించడంతో లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేశారు.
టోల్ మినహాయింపు వల్ల జరిగే నష్టాన్ని కాంట్రాక్టర్ నుంచి వసూలు చేస్తామని NHAI తేల్చి చెప్పింది. జాతీయ రహదారుల నిర్వహణలో నాణ్యత, భద్రత, జవాబుదారీతనానికి NHAI కట్టుబడి ఉందని సదరు అథారిటీ ఈ ప్రకటనలో పేర్కొంది. ఈ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో.. వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగుతున్నాయి.
సుమారు రూ. 4,200 నుంచి రూ.4,700 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో లఖ్ నవూ-కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించారు. 63 కిలోమీటర్ల పొడవు, 6-లేన్లతో నిర్మించిన ఈ హైవేను 2026, జులై 13న కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా ప్రారంభించారు. అయితే, ప్రారంభించిన 12 రోజులకే ఒకే ఒక్క వర్షానికి లఖ్ నవూ-కాన్పూర్ హైవే కుంగిపోయింది.
ఉన్నావ్ జిల్లాలోని కొరారీ సమీపంలో సుమారు 5 నుంచి 7 మీటర్ల మేర రహదారి కుంగిపోయింది. కోట్లకు కోట్లు పెట్టిన నిర్మించిన నేషనల్ హైవే నిండా నెల తిరగకముందే కుంగిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
