ఉద్యోగాల పేరుతో రూ. 52 లక్షల భారీ మోసం.. నెల్లూరులో కిలాడీ లేడీ రజిత అరెస్ట్

ఉద్యోగాల పేరుతో రూ. 52 లక్షల భారీ మోసం..  నెల్లూరులో కిలాడీ లేడీ రజిత అరెస్ట్

నెల్లూరు జిల్లాలో మరో కిలాడీ లేడీ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేస్తూ.. కోట్ల రూపాయలు లూటీ చేస్తున్న లేడీ డాన్ బత్తల రజిత అలియాస్ రమ్య భాగోతాన్ని ఎట్టకేలకు సైదాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 

కలువాయి మండలం చవటపల్లి గ్రామానికి చెందిన ఈ కిలాడీ లేడీ రజిత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వందలాది మందిని బురిడీ కొట్టించింది. తాజాగా సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన అనే మహిళను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించింది.

ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ.. ఐడీ కార్డులు, పోలీస్ వెరిఫికేషన్, అపాయింట్‌మెంట్ లెటర్ల పేరుతో విడతల వారీగా ఏకంగా 52 లక్షల 64 వేల రూపాయలు నొక్కేసింది. ఆ తర్వాత నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, ఫేక్ ఈమెయిల్స్‌తో నమ్మించే ప్రయత్నం చేసింది. బాధితురాలు మోసపోయానని గ్రహించి, డబ్బులు తిరిగి అడగడంతో బెదిరింపులకు దిగింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైదాపురం పోలీసులు రజితను అరెస్ట్ చేశారు.

రాపూరు సీఐ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈమె వెనుక ఒక పెద్ద ముఠానే ఉన్నట్లు తెలుస్తోంది. రజిత మోసాల్లో ఆమె తండ్రి వెంకటేశ్వర్లు, ప్రియుడు చందుతో పాటు ఓ కీలక పోలీస్ అధికారి ప్రమేయం కూడా ఉన్నట్టు బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

గత మూడేళ్లుగా పదుల సంఖ్యలో బాధితులు ఫిర్యాదులు చేసినా.. సదరు పోలీస్ అధికారి అండదండలతోనే ఈ కిలాడీ లేడీ ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గర్భవతులు, పసిబిడ్డలతో బాధితులు నెల్లూరు, కడప ఎస్పీ ఆఫీసుల చుట్టూ తిరిగినా అప్పట్లో న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎట్టకేలకు రజిత అరెస్ట్ కావడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. తాము పోగొట్టుకున్న కోట్ల రూపాయల డబ్బులు తిరిగి ఎలా వస్తాయనే ఆందోళనలో ఉన్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి,రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదే సమయంలో రాపూరు సీఐ శ్రీనివాసరావు నిరుద్యోగులకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా వస్తే నమ్మవద్దని, అలాంటి మోసగాళ్ల సమాచారాన్ని తక్షణమే 112 లేదా సైబర్ క్రైమ్ నంబర్ 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.