E20 పెట్రోల్‌లో క్లోరైడ్ కలుషితం.. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులకు నష్టం: SIAM రిపోర్ట్

E20 పెట్రోల్‌లో క్లోరైడ్ కలుషితం.. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులకు నష్టం: SIAM రిపోర్ట్

దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అమ్మకాలతో వాహనాల్లో కొన్ని కీలక భాగాలు దెబ్బతింటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM) ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇంధనంతో నేరుగా సంబంధం ఉన్న భాగాల్లో తుప్పు, అరిగిపోవడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని పేర్కొంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇథనాల్ మిక్స్ చేసిన పెట్రోల్ తీసుకురావాలనే ప్లాన్స్ జరుగుతున్న వేళ ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏఏ పార్ట్స్ లో ఎక్కువ సమస్యలు?
ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, EGR వాల్వులు, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు వంటి భాగాల్లో భారీగా సమస్యలు నమోదవుతున్నాయని SIAM పేర్కొంది. దెబ్బతిన్న భాగాలను పరిశీలించగా.. వాటిపై అధిక స్థాయిలో క్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్లోరైడ్ కారణంగా మెటల్ పార్ట్స్ తుప్పు పట్టడం, అరిగిపోవడం జరుగుతోందని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి.

ఈ20 పెట్రోల్ శాంపిల్స్‌లో షాకింగ్ వివరాలు
వాహనాల ట్యాంకుల నుంచి సేకరించిన పెట్రోల్ శాంపిల్స్‌లో కిలోకు 500 మిల్లీగ్రాముల వరకు క్లోరైడ్ ఉన్నట్లు SIAM తెలిపింది. దేశంలోని పలు పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన పెట్రోల్ శాంపిల్స్‌లో కూడా 350 మిల్లీగ్రాముల వరకు క్లోరైడ్ కలుషితం ఉన్నట్లు వెల్లడించింది. E20 పెట్రోల్ రాక ముందు ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ఉండేవని.. ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ వచ్చాక ఈ సమస్యలు ఎక్కువయ్యాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

తేమ కూడా మరో పెద్ద సమస్య
క్లోరైడ్ మాత్రమే కాదు.. E20 పెట్రోల్‌లో అధిక తేమ కూడా ఆందోళన కలిగిస్తోంది. రూల్స్ ప్రకారం తేమ పరిమితి 3,000 mg/kg ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో అది 10,000 mg/kg వరకు ఉంటున్నట్లు టెస్టింగ్ లో తేలిందని SIAM తెలిపింది. అధిక తేమ వల్ల పెట్రోల్ ఇథనాల్ విడిపోవడం జరిగి.. పెట్రోల్ పోసిన వెంటనే వాహనం స్టార్ట్ కాని పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లోని పాత భూగర్భ స్టోరేజీ ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్వహణలో లోపాలు కూడా దీనికి కారణమై ఉండొచ్చంది.

ALSO READ : ఆర్డర్ పెట్టకుండానే క్యాష్ ఆన్ డెలివరీలు..

ప్రభుత్వం ఏమంటోంది?
పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అంటోంది. దేశవ్యాప్తంగా 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి కలుషితాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అలాగే 2,000కు పైగా ఇంధన నమూనాలను పరీక్షించగా.. ఇప్పటివరకు కేవలం రెండు కేంద్రాల్లో మాత్రమే క్లోరైడ్ కలుషితం గుర్తించామని, వెంటనే ఆ బంకుల విక్రయాలను నిలిపివేశామని చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితులకు ప్రభుత్వం చెబుతున్న మాటలకు భూమికీ ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. 

కఠినమైన క్వాలిటీ కంట్రోల్స్ అవసరం
భారత్‌లో ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ అమ్మకాలకు తాము పూర్తి సపోర్ట్ ఇస్తున్నామని SIAM స్పష్టం చేసింది. అయితే E20పై ప్రజల్లో అపోహలు పెరగకుండా ఉండాలంటే ఇంధన నాణ్యతపై మరింత కఠిన నియంత్రణలు అవసరమని సూచించింది. క్లోరైడ్, తేమ వంటి కలుషితాలను పూర్తిగా నియంత్రించి, ఇంధన సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తేనే వాహనాల పనితీరు, వినియోగదారుల నమ్మకం రెండూ కాపాడగలమని అభిప్రాయపడింది. హడావిడిగా అందుబాటులోకి తెచ్చిన ఈ20 పెట్రోల్ క్వాలిటీ కంట్రోల్, కలుషితాలు పోవాలంటే మరికొన్ని నెలల పాటు మార్పులు, కఠిన క్వాలిటీ చెక్స్ తప్పవని తెలుస్తోంది.