బోథ్, వెలుగు: ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం యువకుడి హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామానికి చెందిన నాచారపు సతీశ్(23) శుక్రవారం బోథ్ మండలం కరత్వాడ చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల వివరాల ప్రకారం, ఓ యువతి మొదట తన గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. తరువాత మనస్పర్థలతో అతడికి దూరమై, బోథ్‌కు చెందిన మరో యువకుడితో ప్రేమాయణం సాగించింది. మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆ సంబంధాన్నీ ముగించినట్లు తెలుస్తోంది. అనంతరం సతీశ్‌తో పరిచయం పెంచుకుని పెళ్లికి అంగీకరించి ఇటీవల దండలు మార్చుకున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న యువతి మాజీ ప్రేమికులు, మరో నలుగురు యువకులతో కలిసి సతీశ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దావత్ పేరుతో కరత్వాడ చెరువు వద్దకు పిలిచి, మద్యం తాగించిన తర్వాత హత్య చేసి చెరువులో పడేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జూన్ 18న నమోదైన మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
