- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు : 'ఖానాపూర్ నియోజకవర్గంలో అమాయకులపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు పెరిగిపోతున్నాయి, ఇదే వైఖరి కొనసాగితే అటవీశాఖకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మిస్తా' అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. టైగర్ జోన్ ఆంక్షలు, ఫారెస్ట్ ఆఫీసర్ల వైఖరిపై సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారంలోని హరిత రిస్టార్ట్ లో అన్ని కులసంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందన్ పల్లిలో ఆదివాసీ యువకులపై దాడులకు పాల్పడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లను 24 గంటల్లోగా సస్పెండ్ చేయాలని, లేకపోతే మంగళవారం తన కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. డెడ్ లైన్ దాటితే నియోజకవర్గ సర్పంచ్ లు, ప్రజలు ఫారెస్ట్ ఆఫీసర్లకు సహకరించొద్దని సూచించారు. సమావేశంలో అజ్మీర నందునాయక్, దుర్గం లక్ష్మీనారాయణ, సయ్యద్ ఇసాక్, మోహన్ రెడ్డి, ముజఫర్ అలీఖాన్ పాల్గొన్నారు.
