మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. యువత జర్మన్ నేర్చుకుంటే తప్పేంటి: కేటీఆర్‎కు మంత్రి వివేక్ కౌంటర్

మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. యువత జర్మన్ నేర్చుకుంటే తప్పేంటి: కేటీఆర్‎కు మంత్రి వివేక్ కౌంటర్

హైదరాబాద్: రాష్ట్ర యువతకు జర్మనీ వంటి విదేశీ భాషలు నేర్పిస్తామంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవ్వుతున్నాడని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్, కవిత మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. పిల్లలు మాత్రం విదేశీ భాషలు నేర్చుకోవద్దా అని ప్రశ్నించారు. పిల్లలు విదేశీ భాషలు నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. టామ్‎కామ్ ద్వారా యువత బయట దేశాల్లో ఉద్యోగాల్లో కల్పించడానికి కార్యాచరణ చేశామని తెలిపారు. 

జర్మనీలో ఏడాదికి రూ. 25 లక్షల ప్యాకేజీతో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దీనికోసం యువత జర్మనీ భాష నేర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మన యువత అందుకోవడానికి ప్రభుత్వం విదేశీ భాషలు నేర్పిస్తోందన్నారు. భాష నేర్చుకుంటున్నందుకు గాను విద్యార్థులకు రూ. 2000 స్టైఫండ్ కూడా ఇస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఇలా స్టైఫండ్ ఇస్తూ శిక్షణ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

మంగళవారం (ఆగస్ట్ 4) రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రుద్రంగి మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.42 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్తో కలసి మంత్రి వివేక్ భూమి పూజ చేశారు. 

►ALSO READ | రిఫరల్ సెంటర్ గా నిజామాబాద్ హాస్పిటల్..అత్యాధునిక ఎంఆర్‌‌ఐ మెషిన్ ఏర్పాటు..

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఐటీఐలను అడ్వాన్డ్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 65 ఏటీసీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏటీసీల్లో విద్యార్థులకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణతో పాటు రూ.2 వేలు స్టైఫండ్ అందిస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయంలో విద్యార్థులకు ఐటీఐలకు వెళ్లలేదని.. వాటిని ఆధునీకరణ చేయలేదు, డబ్బులు ఖర్చు చేయలేదని విమర్శించారు. కమీషన్లు వచ్చే వాటికోసమే బీఆర్ఎస్ డబ్బులు ఖర్చు చేసిందని ఆరోపించారు. 

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపిస్తాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ముఖ్యమైన వ్యక్తి అని.. అందుకే సీఎం రేవంత్ ఆది శ్రీనివాస్‎కు మొదలే ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని చెప్పారు. ఆది శ్రీనివాస్ మంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి పని చేస్తుందన్నారు. ఆగస్టు 15 నాడు కొత్త పెన్షన్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారని తెలిపారు. విద్య, వైద్యంపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.