హైదరాబాద్ సిటీ జనానికి మంచి శుభవార్త. ఆలస్యంగా అయినా హిమాయత్ సాగర్ కు భారీగా వరద చేరుతుంది. రెండు రోజులుగా వెంకటాపూర్, అమలాపూర్, పాలమాకుల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో.. అక్కడి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్లు అన్నీ ఇప్పుడు హిమాయత్ సాగర్ వైపు వస్తున్నాయని.. వరద ప్రవాహం భారీగా ఉందని చెబుతున్నారు అధికారులు. ఈ క్రమంలోనే డ్యాం అధికారులు అప్రమత్తం అయ్యారు.
2026, ఆగస్ట్ 4వ తేదీ ఉదయానికి హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1761.55 అడుగులకు చేరుకుందని.. జలాశయంలో 2.240 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రకటించారు అధికారులు. జలాశయానికి 750 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. అవుట్‌ఫ్లో లేదని.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే హిమాయత్‌సాగర్ వేగంగా నిండే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ పై జల మండలి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాగుల ప్రవాహం పెరుగుతున్న క్రమంలో.. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తు్న్నారు.
హిమాయత్ సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరదతో.. హైదరాబాద్ సిటీకి నీటి కష్టాలు తప్పినట్లే అని అంచనా వేస్తున్నారు. మరో 2 రోజులు ఇదే విధంగా వరద కొనసాగితే డ్యాం ఫుల్ అవుతుందని.. సిటీకి నీటి కష్టాలతోపాటు ట్యాంకర్ కష్టాలు తప్పుతాయనే ఆశాభావంలో ఉన్నారు జనం. వర్షాకాలం వచ్చి 2 నెలలు అయినా ఇప్పటికీ హైదరాబాద్ సిటీ జనం ట్యాంకర్ నీళ్లపైనే ఆధారపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో నల్లా నీళ్లు సరిపోక.. ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు జనం.
