- 3 వేల క్వింటాళ్ల ఇండెంట్ పెండింగ్
- ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తుతాయని రైతుల ఆందోళన
ఆసిఫాబాద్, వెలుగు: ఖరీఫ్ సీజన్‌లో పచ్చిమేత సాగుకు అవసరమైన సబ్సిడీ గడ్డి విత్తనాలు ఇప్పటి వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చేరలేదు. జూలై ముగిసి ఆగస్టు వచ్చినా సుమారు 3 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు, పశువుల యజమానులు రోజూ అధికారులను అడుగుతున్నా ‘ఇంకా రాలేదు’ అనే సమాధానం వస్తోంది. జిల్లాలో 3.78 లక్షల లైవ్‌స్టాక్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా పచ్చి మేత దొరకడం ఇబ్బందిగా మారనుంది. దీంతో వెంటనే సబ్సిడీ గడ్డి విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా ఇండెంట్ పెండింగ్‌లోనే..
వ్యవసాయ ఆధారంగా జీవించే ప్రజలు పశువుల పెంపకం చేస్తున్నారు. సహజంగా లభించే మేత అనుకున్న స్థాయిలో దొరకడం లేదు. ఎల్‌నినో కారణంగా వరి సాగు కూడా ఎక్కువగా లేకపోవడంతో పశువులకు గ్రాసం మరింత కష్టతరంగా మారనుంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలోనే గడ్డి విత్తనాలను పంపిణీ చేస్తే రైతులు పచ్చిమేతను సాగు చేసి ఏడాది పొడవునా పశువులకు మేతను అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి విత్తనాల సరఫరా ఆలస్యం కావడంతో గడ్డి సాగు కూడా వెనుకబడుతోంది. దీంతో రానున్న నెలల్లో పచ్చిమేత కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.
ఈసారి ఎల్‌నినో కారణంగా ఆశించిన మేర వర్షాలు కురవకపోతే సహజంగా పెరిగే గడ్డి కూడా తగ్గిపోవడంతో పశువుల మేత సమస్య మరింత తీవ్రం కానుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలోని 15 మండలాల్లో 3.78 లక్షల లైవ్‌స్టాక్ యూనిట్లు ఉండగా వీటికి పచ్చిమేత అత్యవసరం. ఇప్పటికే గడ్డి విత్తనాల పంపిణీ ఆలస్యమైందని, వెంటనే జిల్లాకు అవసరమైన విత్తనాలను కేటాయించి పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.
విత్తనాల కోసం ఇండెంట్ పంపించాం..
జిల్లాలో గడ్డి విత్తనాలు పంపిణీ కోసం అవసరమైన ఇండెంట్ ప్రభుత్వానికి పంపించాం. జిల్లాలో మూడు క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉంది. ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. సరఫరా కాగానే రైతులకు పంపిణీ చేస్తాం. పశుగ్రాసం కొరత లేకుండా రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.- సురేశ్, జిల్లా వెటర్నరీ అధికారి, ఆసిఫాబాద్
