నారాయణపేట, వెలుగు: మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూరు, పేరపళ్ల రిజర్వాయర్ల కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట ఆర్డీవో ఆఫీస్ ముందు భూ నిర్వాసితుల జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊట్కూరు, పేరపళ్ల రిజర్వాయర్ల కింద కోల్పోయిన భూములకు, దామరగిద్ద మండలంలో బోర్ బావులు, పైప్ లైన్లు, చెట్లు ఇతర నిర్మాణాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర తీసుకున్న భూమి కంటే అదనంగా ఆక్రమించుకుంటున్న కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదని వాపోయారు. ధర్నాలో లీడర్లు గోపాల్, ధర్మరాజు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
