అగ్గిపెట్టె చీర: ఐదున్నర మీటర్లు ..చేనేత మగ్గంపై 2.50 గంటల్లోనే నేసిన కార్మికుడు

అగ్గిపెట్టె చీర: ఐదున్నర మీటర్లు ..చేనేత మగ్గంపై 2.50 గంటల్లోనే నేసిన కార్మికుడు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : అగ్గిపెట్టెలో పట్టేలా రూపొందించిన ఐదున్నర మీటర్ల చీరను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్దండి హరిప్రసాద్ చేనేత మగ్గంపై రికార్డు సమయంలో నేశాడు. 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర తయారీని కేవలం 2.50 గంటల సమయంలోనే పూర్తి చేశాడు. 

చీర బరువు కేవలం 175 గ్రాములే ఉండడం గమనార్హం. చీర తయారీ పూర్తి అయిన తర్వాత దానిని చాకచక్యంగా మలిచి అగ్గిపెట్టెలో అమర్చాడు. గతంలో ఎన్నో వైవిధ్యభరితమైన వస్త్రాలను తయారు చేసిన హరిప్రసాద్.. తాజాగా తక్కువ టైంలో చేనేత మగ్గంపై చీరను నేయడంతో పలువురు అభినందించారు. ఈ నెల 7న చేనేత దినోత్సవం సందర్భంగా ఈ చీరను తయారు చేసినట్లు హరిప్రసాద్ పేర్కొన్నారు. హరిప్రసాద్ ను సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి  అభినందించారు.