ఈ నెల 1న హనుమకొండ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఏపీ 36 ఏడీ 3500 నెంబర్ వెహికల్ డ్రైవర్ హెల్మెట్ లేకుండా వెళ్లాడు. ఆ వెహికల్‌ను ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీశారు. కానీ, ఫైన్ విధించే క్రమంలో ఆ బండి నెంబర్‌కు బదులు ‘ఏపీ 36 ఏక్యూ 3500' నెంబర్ ఎంట్రీ చేశారు. దీంతో రూల్స్ పాటించని వ్యక్తికి పడాల్సిన ఫైన్ మరో వాహనదారుడికి నమోదైంది. ఫైన్ కట్టాల్సిందిగా వాహనదారుడికి మెసేజ్ వెళ్లడంతో ఆయన కంగుతిన్నాడు.
టీఎస్ 03 ఎఫ్ జీ 2902 నెంబర్ గల స్కూటీ కేయూ నుంచి సీపీవో జంక్షన్ వైపు వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్ లేని కారణంతో ఫైన్ విధించారు. కానీ, ఆ ఫైన్ ను టీఎస్ 03 ఎఫ్ జీ 2702 నెంబర్ గల మరో స్కూటీకి వేయడం గమనార్హం. టీఎస్ 03 ఈఏ 1269 నెంబర్ గల స్కూటీ వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్ లో రూల్స్ బ్రేక్ చేస్తే ఆ ఫొటోతో టీఎస్ 03 ఎఫ్ఏ 1269 నెంబర్ గల బండికి ఫైన్ వేశారు.
- ఒక వెహికిల్ కు బదులు.. మరో దానికి ఫైన్
- నిర్లక్ష్యంతో రాంగ్ చలాన్లు జనరేట్ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది
- రిపోర్ట్ చేసినా సరిదిద్దడం లేదు
- వాహనదారులపై పడుతున్న తప్పుడు చలాన్ల భారం
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం వాహనదారులను చిక్కుల్లో పడేస్తోంది. రోడ్డుపై రూల్స్ పాటించడం లేదంటూ ఫైన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జనరేట్ సమయంలో మిస్టెక్స్ చేస్తున్నారు. దీంతో ఒక బండి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు మరో బండికి వెళ్తున్నాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బందుల్లో పడాల్సివస్తోంది. కమిషనరేట్ వ్యాప్తంగా పెండింగ్ చలాన్లు పేరుకుపోగా, అందులో రాంగ్ జనరేటెడ్ ఫైన్లు పెద్ద సంఖ్యలోనే ఉండటం కలవరపెడుతోంది. బాధితులు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టంలో రిపోర్ట్ చేసినా ఫలితం ఉండకపోవడంతో వాహనదారులు పెండింగ్ చలాన్ల భారాన్ని మోయాల్సివస్తోంది.
డైలీ 2 లక్షలకుపైగా వెహికల్స్..
గ్రేటర్ వరంగల్ సిటీలోనే వివిధ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, హోటల్స్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్సులతో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు, ఇతర అధికారుల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో అవసరాల నిమిత్తం ప్రతిరోజు రెండు లక్షలకుపైగా వెహికల్స్ వరంగల్ నగర రోడ్లపై తిరుగుతున్నాయి. సిటీలోకి వస్తున్న వాహనదారులు చాలామంది ట్రాఫిక్ రూల్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద పోలీసులు ఏటా లక్షలాది వెహికల్స్ కు ఫైన్లు విధిస్తున్నారు. ఇలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కారణంతో గతేడాది మొత్తంగా 10.8 లక్షలకుపైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కింద ఫైన్లు విధించడం గమనార్హం.
ఒక బండి ఫైన్ మరోదానికి..
సిటీలోకి ఎంటరైన వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్ లో ప్రయాణించడం, రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ అమర్చుకోకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయకపోవడం, సిగ్నల్ జంప్ చేయడం తదితర కారణాలతో ట్రాఫిక్ పోలీసులు చాలాన్లు విధిస్తున్నారు. సిటీలో ఈ మధ్య ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టం (ఏఎన్పీఆర్) తో ఫైన్లు విధించేలా సీపీవో, అశోక, అదాలత్ తదితర జంక్షన్లలో కెమెరాలు ఏర్పాటు చేయగా, మిగతా చోట్ల ట్రాఫిక్ సిబ్బంది ఫొటోలు తీసి ఫైన్లు వేస్తున్నారు. ఇలా ఫొటోలు తీసి ఫైన్లు విధించే క్రమంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది వెహికల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసి, ఈ-చలాన్ జనరేట్ చేస్తున్నారు. దీంతో ఒక బండికి పడాల్సిన ఫైన్ మరో బండి పడుతోంది. ఇలా తప్పుగా చాలాన్లు పడిన వెహికల్స్ పెద్ద సంఖ్యలోనే ఉండటం గమనార్హం.
రిపోర్ట్ చేసినా నో యాక్షన్!
తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ సిస్టం సైట్ ద్వారా ట్రాఫిక్ చాలాన్లు క్లియర్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చారు. దాంతో పాటు తప్పుడు చలాన్లపై రిపోర్ట్ చేసేలా అందులో మరో ఆప్షన్ కూడా ఉంది. కానీ, రాంగ్ ఫైన్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిపోర్ట్ చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదివరకు ఏపీ 36 ఎస్ 3017 నెంబర్ బండికి ఏపీ 36ఏఎస్ 3017 కు సంబంధించిన ఫైన్ విధించారు.
పలుమార్లు రిపోర్ట్ చేసినా ఇంతవరకు ఆ ఫైన్ క్లియర్ కాలేదు. బాధితుల విజ్ఞప్తి మేరకు సమస్యను రెక్టిఫై చేయాల్సి ఉన్నప్పటికీ పోలీసులు లైట్ తీసుకుంటున్నారని వాహనదారులు వాపోతున్నారు. వేరే వెహికల్స్ ఫైన్లు తమకు విధించడంతో కొంతమంది పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పెద్దసంఖ్యలో చలాన్లు పెండింగ్ ఉంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తప్పుగా జనరేట్ అయిన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టాలని వాహనాదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
