లక్ష్మణచాంద (మామడ), వెలుగు : భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పోతారం గ్రామానికి చెందిన పెద్దోళ్ల బావన్న, లింబాద్రి (45) అన్నదమ్ములు. ఇద్దరి మధ్య వ్యవసాయ భూముల గెట్టు, బోరుబావి, పొలాలకు వెళ్లే దారి విషయంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
దీంతో లింబాద్రిపై కక్ష పెంచుకున్న బావన్న అతడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బంధువుల మధ్య గొడవ జరుగుతుండగా, లింబాద్రి అక్కడికి వెళ్లి వారిని సముదాయించి తిరిగి ఒంటరిగా వస్తున్నాడు.
గమనించిన బావన్న కత్తితో లింబాద్రిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి పరార్ అయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ లింబాద్రిని నిర్మల్ హాస్పిటల్ కు తరలించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ అర్ధరాత్రి ఒంటి గంటకు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.
