జన్నారం, వెలుగు: ఆదివాసీ యువకులపై దాడి చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం ఆదివాసీలు రాస్తారోకో నిర్వహించారు. చేపల కోసం వాగుకు వెళ్లిన ఆదివాసీ యువకులపై ఆదివారం ఫారెస్ట్ ఆఫీసర్లు ఇష్టానుసారంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణతో పాటు దాడిలో పాల్గొన్న ఫారెస్ట్ సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి.. కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్లపై ఆదివాసీ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయక్ పోడు సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గంజి రాజన్న, సెక్రటరీ భీంరావు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జున్, ఆదివాసీ సంఘల రాష్ట్ర నాయకులు కుడిమెత తిరుపతి, కొమ్ముల బాపు, సోయం జంగు పాల్గొన్నారు.
