కర్నాటకలో కేబినెట్ విస్తరణ..20 మందికి మంత్రులుగా అవకాశం

కర్నాటకలో కేబినెట్ విస్తరణ..20 మందికి మంత్రులుగా అవకాశం

బెంగళూరు: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల తర్వాత కేబినెట్‌‌ను విస్తరించారు. కేబినెట్‌‌లో 20 మందికి చోటు కల్పించారు. లోక్‌‌భవన్‌‌లో కొత్త మంత్రులతో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్ లాడ్ వంటి పాత మంత్రులతో పాటు కొత్త వారికీ కూడా కేబినెట్‌‌లో అవకాశం దక్కింది. అసెంబ్లీ కొత్త స్పీకర్‌‌గా జీఎస్ పాటిల్‌‌ నియమితులయ్యారు.

గతంలో స్పీకర్‌‌గా ఉన్న యూటీ ఖాదర్ కేబినెట్‌‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేరడంతో ఖాళీ అయిన ఆ స్థానంలో పాటిల్‌‌ను ఖరారు చేశారు. కేబినెట్‌‌లో కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ హైకమాండ్ సమతుల్యత పాటించింది. కర్నాటకలో సీఎంతో సహా గరిష్టంగా 34 మందికి మంత్రులుగా అవకాశం ఉంటుంది. తాజా విస్తరణతో కేబినెట్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది.     

 అసంతృప్తితో ఎమ్మెల్యే రాజీనామా  

కేబినెట్ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి. పాటిల్ సోమవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన విధానసౌధలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి తన రాజీనామా లేఖను సమర్పించారు. పాటిల్ రాజీనామా వార్త వెలువడటంతో ఆయన మద్దతుదారులు విధానసౌధ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.