- ట్రాఫిక్‌కు అంతరాయం..మంత్రి పొన్నం హామీతో సద్దుమణిగిన వివాదం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో తమకు తగిన గౌరవం, ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపిస్తూ జోగినీలు సోమవారం ఆందోళనకు దిగారు. ఆర్‌పీ రోడ్డులోని బాటా కమాన్ వద్ద పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ధర్నాకు వస్తున్న జోగినీలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
జోగిని శ్యామల మాట్లాడుతూ, తరతరాలుగా బోనాల ఉత్సవాల్లో జోగినీలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈసారి తమకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో దేవాదాయ శాఖ విఫలమైందని విమర్శించారు. పోలీసుల తీరుతో బోనాలు కిందపడ్డాయని, జరిగిన అపచారాన్ని ప్రభుత్వం సరిదిద్దాలన్నారు. వారంలో అవకాశం కల్పిస్తే తిరిగి బోనాలు సమర్పిస్తామని తెలిపారు.
మంత్రి హామీతో ఆందోళన విరమణ..
ఆందోళన అనంతరం జోగినీలను పోలీసులు ఆలయంలోకి అనుమతించారు. ఆలయ అధికారులు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, జోగినీలు తమ అభ్యంతరాలను మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, జోగినీలకు తగిన గౌరవం కల్పిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, సంప్రదాయ కార్యక్రమాల్లో జోగినీల పాత్రకు తగిన గౌరవం ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
