బ్రిజ్ భూషణ్ కు క్లీన్‌‌‌‌‌‌‌‌ చిట్.. రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కోర్టు తీర్పు

బ్రిజ్ భూషణ్ కు క్లీన్‌‌‌‌‌‌‌‌ చిట్.. రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కోర్టు తీర్పు
  • ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని కేసు కొట్టివేత
  • వ్యవస్థలన్నీ కలిసి ఆయన్ను కాపాడినయ్​.. అప్పీల్​కు వెళ్తా: వినేశ్​ ఫోగాట్​

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో బీజేపీ మాజీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌‌‌‌‌‌‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం క్లీన్‌‌‌‌‌‌‌‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో మరో నిందితుడైన డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. బ్రిజ్​భూషణ్ పై చేసిన ఆరోపణలను నిరూపించేంత బలమైన సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) అశ్విని పన్వార్ పేర్కొన్నారు. 

తీర్పు అనంతరం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ, మొదటి రోజు నుంచే తాను నిర్దోషినేనని చెబుతున్నానని, చివరకు నిజమే గెలిచిందన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వివాదం 2023 జనవరిలో వెలుగులోకి వచ్చింది. 2016–2019 మధ్య బ్రిజ్ భూషణ్ పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్ వద్ద ఆందోళన ప్రారంభించారు. 

సుమారు 40 రోజులకుపైగా ఉద్యమం కొనసాగించారు. పార్లమెంట్ కొత్త భవనం వైపు మార్చ్‌‌కు ప్రయత్నించిన సమయంలో పోలీసులు రెజ్లర్లను అడ్డుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాదం తర్వాత కేంద్ర క్రీడాశాఖ డబ్ల్యూఎఫ్‌‌ఐ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక కమిటీని నియమించింది. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ అధ్యక్ష పదవీకాలం ముగియడంతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం ఢిల్లీ పోలీసులు ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు ఆధారంగా చార్జ్‌‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా మొత్తం 32 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిశీలించింది. ఫిర్యాదుదారుల వాంగ్మూలాలతో పాటు ఇతర సాక్ష్యాల్లో ఆరోపణలను నేరంగా నిరూపించే స్థాయిలో స్పష్టత, బలం లేదని పేర్కొంటూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

నన్ను నమ్మిన వారికి ధన్యవాదాలు

తీర్పు అనంతరం బ్రిజ్ భూషణ్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. "ఈ ఆరోపణలు వచ్చిన తొలి రోజు నుంచే నేను నిర్దోషినేనని చెబుతున్నాను. నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది. నా కుటుంబం, నన్ను నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నా మీద ఆరోపణలు చేసిన వారిపట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు. దేవుడు, న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నిజం చివరకు గెలిచింది" అని ఆయన అన్నారు. 

వ్యవస్థలన్నీ కలిసి కాపాడాయ్ రెజ్లర్​ వినేశ్ ఫోగాట్

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌ను ఢిల్లీ న్యాయస్థానం నిర్దోషిగా తీర్పివ్వడంపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ ఈ రాజకీయనాయకుడిని కాపాడేందుకే ఆధిపత్య వ్యవస్థలన్నీ శక్తివంచన లేకుండా పనిచేశాయని ఆమె ఆరోపించారు. ఈ తీర్పు తమను తీవ్రంగా నిరాశపరిచినా, తమ పోరాటం ఇక్కడితో ఆగదని.. త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. 

‘మహిళా రెజ్లర్లు ఎన్నో అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా కోర్టులో పోరాడారు. కానీ, బ్రిజ్ భూషణ్‌‌పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం. ఈ కేసు ప్రారంభం నుంచి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, మొత్తం వ్యవస్థ అంతా అతడిని కాపాడటానికే ప్రాధాన్యమిచ్చాయి’ అని వ్యాఖ్యానించారు.