- కమలం కంచుకోట బిహార్‌లోని బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ గెలుపు
- బీజేపీ చీఫ్ నబీన్ సొంత సెగ్మెంట్‌లో 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం
- మధ్యప్రదేశ్‌లోని దాతియాలో కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ
- గుజరాత్లో సిట్టింగ్ సీటు మంజల్పూర్ను నిలబెట్టుకున్న బీజేపీ
పాట్నా: బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో జన్‌సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. కౌంటింగ్‌లో మొదటి నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఆయన18 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్‌పై విజయం సాధించారు. దీంతో ప్రశాంత్ కిశోర్ తను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలిచినట్టైంది. 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ సెగ్మెంట్‌ను కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలను అంచనా వేసే పనిలో పడ్డారు.
బిహార్‌కు సమర్థుడైన సీఎం కావాలి: పీకే
బీజేపీ 30 ఏండ్ల రాజకీయ కంచుకోటను బిహార్ ప్రజలు 30 రోజుల్లోనే మటాష్ చేశారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక కాదని, బిహార్‌కు ఎలాంటి నాయకత్వం కావాలో ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బిహార్‌కు సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ప్రజలు ఈ ఫలితం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉపాధి, విద్య, అవినీతి నిర్మూలన, వలసల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. బిహార్ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేసేందుకు పుట్టలేదన్నారు. లక్షలాది మంది ఇక్కడి యువకులు పదీపదిహేను వేల జీతం కోసం గుజరాత్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి మారాలని, బిహార్‌లోనే ఉద్యోగ అవకాశాలు సృష్టించే పాలన రావాలని డిమాండ్ చేశారు. ‘‘నేను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన బంకీపూర్‌ను ఒక్కరోజులోనే బెంగళూరుగా మార్చలేను. కానీ, కొద్ది నెలల్లో తప్పకుండా మార్పు కనిపించేలా పనిచేస్తా” అని ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చారు.
బంకీపూర్ నియోజకవర్గం 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా కొనసాగుతోంది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ సిన్హా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పట్టును నిలబెట్టారు. అనంతరం ఆయన వారసుడిగా నితిన్ నబీన్ కూడా వరుసగా 4 ఎన్నికల్లో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నితిన్ నబీన్ దాదాపు 52 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
ఇటీవల ఆయన రాజ్యసభకు నామినేట్ కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో జులై 30న బంకీపూర్ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక నిర్వహించగా తాజాగా సోమవారం ఫలితం వెలువడింది. నితిన్ నబీన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నందున బంకీపూర్ బరిలో మొదట అభిషేక్ కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన వైదొలగడంతో చివరి నిమిషంలో బీజేపీ యువ మోర్చా నేత నీరజ్ కుమార్ సిన్హాను దింపారు. అయినప్పటికీ బీజేపీ తన ఓటుబ్యాంకును కాపాడుకోలేకపోయింది.
కుక్కను నిలబెట్టినా గెలుస్తమన్న కామెంట్లకు రిటన్ గిఫ్ట్
బీజేపీ ఓటమితో గతంలో ఆ పార్టీ సీనియర్ నేత, పాట్నా సాహిబ్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ చేసిన కామెంట్లు వార్తల్లోకెక్కాయి. ‘‘బంకీపూర్‌లో బీజేపీ తరఫున కుక్కను నిలబెట్టినా, లేదంటే పిల్లిని దించినా మోదీ పేరు మీద గెలుపు ఖాయం” అని అన్నారు. ఈ కామెంట్లపై అప్పట్లో విపక్షాలు మండిపడ్డాయి. ఇప్పుడు బీజేపీ ఓడిపోవడంతో ఆ కామెంట్లు మరోసారి హైలైట్ అయ్యాయి. ప్రజలు బ్యాలెట్‌తోనే బుద్ధి చెప్పారంటూ జనసురాజ్ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
