మోదీ గ్రాఫ్ పడిపోతోంది..బంకీపూర్ ఫలితమే నిదర్శనం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మోదీ గ్రాఫ్ పడిపోతోంది..బంకీపూర్ ఫలితమే నిదర్శనం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • జెన్‌‌జీ మార్పు కోరుకుంటున్నది
  • రాహుల్‌‌ నాయకత్వానికి యువత మద్దతు పెరుగుతోందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బిహార్‌‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ ఓటమి ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతమన్నారు. 

దేశవ్యాప్తంగా మార్పు మొదలైందని, బీజేపీకి ఆదరణ తగ్గుతోందని, కాంగ్రెస్‌‌పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన బంకిపూర్‌‌లో, జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిశోర్ విజయం సాధించడం ద్వారా బీజేపీకి ప్రజలు గట్టి సందేశం ఇచ్చారన్నారు. 

బంకీపూర్ తీర్పును కేవలం ఒక నియోజకవర్గ ఫలితంగా చూడకూడదని, దేశంలో వస్తున్న రాజకీయ మార్పునకు సంకేతంగా భావించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల గొంతుకను అణచివేయడం ఎవరి వల్లా కాదన్నారు. సరైన సమయంలో ఓటుతోనే ప్రజలు సమాధానం చెబుతారన్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీకి పట్టు ఉన్న బంకీపూర్‌‌లో ఆ పార్టీ కంచుకోట బద్దలవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని మంత్రి వివేక్ పేర్కొన్నారు. 

ప్రజల తీర్పును మార్చలేరు..

అధికార బలం, ప్రచార ఆర్భాటం ఎంత ఉన్నా ప్రజల తీర్పును మార్చలేరని ఈ ఫలితం మరోసారి నిరూపించిందని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. దేశ యువతలో కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని, ముఖ్యంగా జెన్‌‌జీ యువత ఉపాధి, నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తోందన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. 

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో పేరుకుపోయిన నిరాశ, అసంతృప్తి ఇప్పుడు ఓటు రూపంలో వ్యక్తమవుతోందన్నారు. ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలవడం దేశ యువతకు ఆశాదీపంగా మారిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్‌‌ పార్టీకి, రాహుల్ గాంధీ నాయకత్వానికి యువత మద్దతు పెరుగుతోందని ఆయన తెలిపారు.