- ఆర్. కృష్ణయ్య డిమాండ్
మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
సోమవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ నాయకత్వంలో విద్యార్థులు మాసాబ్‌ట్యాంక్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
ఫీజులు అందక కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, కొత్త అడ్మిషన్లు నిలిపివేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు నీల వెంకటేశ్, రాజేందర్ ముదిరాజ్, పగిళ్ల సతీశ్, ఆశిష్ గౌడ్ పాల్గొన్నారు.
