హైదరాబాద్, వెలుగు: వీబీ జీ రామ్‌జీ పథకంలో సేవలందిస్తున్న ఎఫ్‌టీఈ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. సోమవారం ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ ఆఫీసు ఎదుట వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కష్టపడి పనిచేస్తున్న తమకు సరైన వేతనాలు ఇవ్వకుండా, పేస్కేళ్లు అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు రాక కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నామని వాపోయారు.
ఎస్‌ఆర్‌డీఎస్ , వీబీ జీ రామ్‌జీ ఎఫ్‌టీఈ ఉద్యోగులకు తక్షణమే పే స్కేళ్లను అమలు చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఈ నెల 15లోగా తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
