ఏటీసీతో స్థానికంగానే యువతకు సాంకేతిక విద్య, శిక్షణ పొందే చాన్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఏటీసీతో స్థానికంగానే యువతకు సాంకేతిక విద్య, శిక్షణ పొందే చాన్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి

సిరిసిల్ల: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC)తో గ్రామీణ యువత స్థానికంగానే సాంకేతిక విద్య, శిక్షణ పొందే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం (ఆగస్ట్ 4) రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రుద్రంగి మండలం కేంద్రంలో  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.42 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC)  నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్‎తో కలసి మంత్రి వివేక్ భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఏటీసీతో గ్రామీణ యువతకు పట్టణాలకు వెళ్లకుండా స్థానికంగానే నాణ్యమైన సాంకేతిక విద్య, శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఉపాధి సామర్థ్యం పెరుగుతుందని.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. పరిశ్రమల అనుసంధానం ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఉండటం వల్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.