- విద్యుత్ ఉత్పత్తికి ముందస్తు చర్యలు: సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం వచ్చినా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైనంత బొగ్గు అందిస్తామని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సింగరేణి, తెలంగాణ జెన్‌కో ఇంజినీర్ల సమన్వయ సమావేశం జరిగింది.
ఈ మీటింగ్‌లో జెన్‌కో చైర్మన్ డాక్టర్ హరీశ్ కూడా పాల్గొన్నారు. యాదాద్రి సహా అన్ని థర్మల్ ప్లాంట్లలో పవర్ జనరేషన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్వాలిటీ బొగ్గును సరిపడా అందించాలని జెన్‌కో అధికారులు కోరారు. దీనిపై స్పందించిన బుద్దప్రకాష్ జ్యోతి.. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో దాదాపు 93 శాతం ఓపెన్‌కాస్ట్ గనుల నుంచే వస్తుందని చెప్పారు.
భారీ వర్షాల వల్ల ఈ గనుల్లో ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉన్నప్పటికీ, పవర్ సప్లైలో ఎలాంటి లోటు రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వివరించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గనుల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి ఏడాదికి 28 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేస్తోందని, రోజుకు 60 వేల నుంచి 70 వేల టన్నుల వరకు బొగ్గు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మీటింగ్‌లో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ శ్రీనివాస్, తెలంగాణ జెన్‌కో ఈడీ నగ్యా, డైరెక్టర్ రాజశేఖర్, సీఈ లక్ష్మయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
