హైదరాబాద్, వెలుగు: వాన్‌పిక్ కేసులో ఈడీ జారీ చేసిన ఆస్తుల జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను జస్టిస్ పీఎస్ శ్యాంకోశి, జస్టిస్ సుద్దాల చలపతిరావుల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయనకు సంబంధించిన సంస్థలకు చెందిన రూ.538.31 కోట్ల ఆస్తులు, నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూపు సంస్థలకు చెందిన రూ.325.02 కోట్ల విలువైన ఆస్తులు, షేర్ల జప్తును అప్పీలేట్ ట్రిబ్యునల్ గతంలో రద్దు చేసింది.
జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరిపైనే చర్యలు తీసుకోవడంపై సందేహాలు ఉన్నాయని పేర్కొంది. నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూపు సంస్థలు రూ.274.95 కోట్ల ఇండెమ్నిటీ బాండ్లు సమర్పించాలని షరతు విధించింది. అప్పీలేట్ ట్రైబ్యునల్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీర్పు ఇచ్చిందని, ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేస్తూ ఈడీ అప్పీళ్లను హైకోర్టు తిరస్కరించింది.
