- కేరళ 'జటాయు' తరహాలో భువనగిరి కోట.. సముద్రపు రేవులా సోమశిల రూపకల్పన
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.470 కోట్లతో మౌలిక వసతుల కల్పన
- ప్రకృతి, చరిత్ర, సాహస క్రీడలతో అడ్వెంచర్ టూరిజం.. యువత, మహిళలకు ఉపాధి
- 100 వీకెండ్ గేట్వేలు.. యువత, మహిళలకు ఉపాధి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేవలం విహార యాత్రలకే పరిమితం కాకుండా, సందర్శకులకు విభిన్నమైన అనుభూతిని కలిగించేలా రాష్ట్రవ్యాప్తంగా 21 పర్యాటక క్లస్టర్లను గుర్తించింది. ఇందులో భాగంగా తొలి దశలో ఎనిమిది ప్రధాన ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేలా ‘అష్ట’ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సుమారు రూ.470 కోట్లతో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పించే ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.181 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరవగా.. బుద్ధవనం, రామప్ప, సోమశిల, నిజాంసాగర్, బల్కంపేట ఆలయాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.289 కోట్ల వ్యయంతో 71 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
నగర ప్రజల కోసం ప్రభుత్వం 100 ‘వీకెండ్ గేట్‌వే డెస్టినేషన్స్’ను సిద్ధం చేసింది. శని, ఆదివారాల్లో కుటుంబంతో కలిసి వెళ్లి సేద తీరేలా అన్ని కర్యాలనూ కల్పిస్తోంది. పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే భువనగిరి, ఖమ్మం కోటల వద్ద రోప్‌వే ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. సోమశిల, హుస్సేన్ సాగర్, కోటిపల్లిలో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, హుస్సేన్ సాగర్‌లో ‘ముచుకుంద’ లగ్జరీ డబుల్ డెక్ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. లక్నాపూర్, నిజాంసాగర్, వరదవెల్లి ప్రాంతాల్లో బోటింగ్ కర్యాలను విస్తరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యువత, మహిళలకు ఉపాధి లభించనుంది.
తొలి విడతలో 8 పర్యాటక ప్రాంతాలపై ఫోకస్..
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 21 క్లస్టర్లుగా వర్గీకరించింది. భౌగోళిక ప్రాధాన్యత, చారిత్రక నేపథ్యం, పర్యాటకుల ఆదరణను బట్టి తొలి దశలో ఎనిమిది ప్రాంతాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేలా ‘సమగ్ర మాస్టర్ ప్లాన్’కు శ్రీకారం చుట్టింది.
ప్రకృతి ఒడిలో పులకరింత : నగరానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉండి 'తెలంగాణ ఊటీ'గా పేరుగాంచిన అనంతగిరి కొండల్లో ఎకో టూరిజంపై ప్రభుత్వం ఫోకస్పెట్టింది. పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి ప్రేమికుల కోసం ఇక్కడ సుస్థిర పర్యాటక మౌలిక వసతులు, ట్రెక్కింగ్ మార్గాలు, క్యాంపింగ్ కర్యాలను అభివృద్ధి చేయనుంది.
నదీ తీరాన ఆధ్యాత్మిక అలలు (సోమశిల - అలంపూర్): కృష్ణా నది తీరాన ఆధ్యాత్మికత, ప్రకృతి అందాల మేళవింపుతో కూడిన ఈ సర్క్యూట్లో సోమశిల బ్యాక్ వాటర్స్‌ను ఒక రేవు పట్టణంగా మారుస్తున్నారు. అక్కడి నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన అలంపూర్ వరకు క్రూయిజ్ పర్యాటకాన్ని విస్తరించనున్నారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
ప్రపంచ వారసత్వ వైభవం (వరంగల్ - రామప్ప): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతోపాటు ఓరుగల్లు కోట వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఈ సర్క్యూట్ రూపొందుతోంది. కాకతీయుల శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబించేలా హెరిటేజ్ వాక్‌లు, ఆధునిక లైట్ అండ్ ండ్ షోలు, ఇతర కర్యాలను మెరుగుపరచనున్నారు.
జలకళ.. బౌద్ధ శాంతి (నాగార్జున సాగర్): ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ మ్యూజియాల్లో ఒకటైన 'బుద్ధవనం'ను కేంద్రంగా చేసుకుని నాగార్జున సాగర్ అభివృద్ధి సాగుతోంది. జలాశయంతో కూడిన వాటర్ టూరిజం, బౌద్ధ సంస్కృతిని అధ్యయనం చేసే పర్యాటకుల కోసం అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించనున్నారు.
భక్తి మార్గం.. నేతన్నల హస్తకళ (యాదాద్రి - పోచంపల్లి): పునర్నిర్మితమైన యాదాద్రి దివ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులను, పోచంపల్లి ఇక్కత్ చేనేత కళ వైపు మళ్లించేలా యాదాద్రి - పోచంపల్లి పర్యాటక సర్క్యూట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
అడవి అందాలు.. గిరిజన సంస్కృతి (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలను గిరిజన సర్క్యూట్‌గా ఏర్పాటు చేస్తున్నారు. కుంతల, పొచ్చెర వంటి జలపాతాలు, దట్టమైన అడవులతో అలరారే ఆదిలాబాద్‌లో అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తున్నారు. గిరిజన సంస్కృతిని, వారి సంప్రదాయాలను పర్యాటకులు దగ్గరగా చూసేలా 'ట్రైబల్ టూరిజం'ను ప్రోత్సహిస్తున్నారు.
గోదావరి తీరాన పుణ్యక్షేత్రం (భద్రాచలం): దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. యాత్రికుల కర్యార్థం ఘాట్ల అభివృద్ధి, అన్నదాన సత్రాలు, ఆధ్యాత్మిక ప్రవచన కేంద్రాలను మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు.
కాళేశ్వరం క్లస్టర్: త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో అటు ముక్తీశ్వర స్వామి భక్తితోపాటు ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేలా భక్తి, విజ్ఞానాల కలబోతగా ఈ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
