- ర్యాంక్‌తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్ చేయనున్న సర్కారు
- సర్కారు, రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్స్‌కూ ఫీజు మాఫీ
- బీసీ, ఓసీలకు 10 వేలలోపు ర్యాంకు వస్తేనే ఉచితం
- మిగిలిన వారికి కాలేజీ ఫీజు ఎంత ఉన్నా రూ. 35 వేలే
- రూ. 2.50 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికే వర్తింపు
- మొదలైన టీజీ ఎప్‌సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఏ కాలేజీలో చదివినా ఎప్‌సెట్‌లో వచ్చిన ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నది. రెండ్రోజుల క్రితం ఎప్‌సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధికారులు ఫీజులపై స్పష్టత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులతోపాటు సర్కారు కాలేజీలు, గురుకులాల్లో ఇంటర్ చదివిన స్టూడెంట్లకూ ప్రభుత్వమే మొత్తం ఫీజు చెల్లించనున్నది. సంక్షేమ శాఖల రెసిడెన్షియల్స్‌తోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లుసహా కార్పొరేట్ కాలేజీ స్కీమ్ కింద చదువుకున్న విద్యార్థులకు కూడా 100 శాతం ఫీజు మినహాయింపు వర్తించనున్నది.
బీసీ, ఓసీలకు ర్యాంక్ నిబంధన
బీసీ, జనరల్ కేటగిరీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కావాలంటే ఎప్‌సెట్‌లో 10 వేల ర్యాంకు సాధించి ఉండాలి. వారికి మాత్రమే ప్రభుత్వం కాలేజీలోని మొత్తం ఫీజును భరిస్తోంది. బీసీ, జనరల్ కేటగిరీల్లోని స్టూడెంట్లకు 10 వేల కంటే ఎక్కువ ర్యాంక్ ఉంటే పూర్తి ఫీజు వర్తించదు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ఎంత ఉన్నప్పటికీ, సర్కారు మాత్రం రూ. 35 వేలు మాత్రమే అందించనున్నది. మిగిలిన ఫీజు మొత్తాన్ని విద్యార్థులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే , ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు తప్పనిసరిగా తెలంగాణ స్థానికత కలిగి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలి. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల వివరాలను వెరిఫై చేసిన తర్వాతే ఈ ఫీజులు వర్తించనున్నాయి.
25 నుంచి ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్లు..
టీజీ ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు ప్రాసెస్ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉండే సీట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకా రెండు కాలేజీల నుంచి సీట్ల వివరాలు అడ్మిషన్ల వింగ్‌కు రావాల్సి ఉంది. గతేడాది ఉన్న సీట్లన్నీ ఈ ఏడాది కౌన్సెలింగ్‌కు అందుబాటులో పెట్టే అవకాశం ఉంది. అయితే, ఏఐసీఈటీ నుంచి కొత్తగా అనుమతులు పొందిన సీట్లపై మాత్రం సర్కారు నుంచి అనుమతి వస్తేనే, వాటిని కౌన్సెలింగ్‌లో ఉంచే అవకాశం ఉంది. కాగా, ఎప్‌సెట్ ఇంజినీరింగ్ కేటగిరీలో మొత్తం 1.44 లక్షల మంది క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.
