- నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు
- మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ర్టంలోని 2,492 గ్రామాల్లో టీబీ నిర్ధారణ కోసం హెల్త్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం దేశంలో క్షయ నిర్మూలన, మాతా-శిశు సంరక్షణ కార్యక్రమాలపై అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. టీబీ అనుమానితులందరికీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అనంతరం చికిత్సతో పాటు పౌష్టికాహారం కోసం నిక్షయ పోషణ యోజన కింద ప్రతి నెలా రూ.వెయ్యి అందించాలని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధితులకు పౌష్టికాహారం కోసం ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నామని చెప్పారు. మాతా-శిశు సంరక్షణలో భాగంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ముందుగానే గుర్తించి, గర్భిణులకు అవసరమైన బర్త్ ప్లానింగ్ సదుపాయాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే హైపర్‌టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలను గుర్తించేందుకు హెల్త్ స్క్రీనింగ్, చెకప్‌లు, చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నవజాత శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, టీబీ కంట్రోల్ జేడీ రాజేశం తదితరులు పాల్గొన్నారు.
