హైదరాబాద్, వెలుగు: ధాన్యం నిల్వ వ్యవస్థను శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధానంగా వరి పండించే జిల్లాల్లో 20 ప్రాంతాల్లో అత్యాధునిక సైలోల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు ఏటా పెరుగుతున్న నేపథ్యంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో సైలోలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రారంభ దశలో 50 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నెట్‌వర్క్ అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. పంట కోతల అనంతరం నిల్వ నష్టాలు తగ్గించి, ధాన్యం నాణ్యతను కాపాడుతూ రవాణాను సమర్థవంతంగా నిర్వహించడమే వీటి లక్ష్యమన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కార్మికుల కొరత, రవాణా జాప్యం వంటి సమస్యలకు సైలోలు పరిష్కారంగా మారతాయని, రైల్వే-లాజిస్టిక్స్ అనుసంధానంతో ధాన్యం రవాణా వేగవంతం అవుతుందని తెలిపారు. సైలోల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, అమలు విధానాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
