హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పొద్దున్నుంచి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసి సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సిటీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు సిటీ అవుట్ స్కట్స్ లో కూడా వర్షం పడింది. దీంతో సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ కు ఆటంకం ఏర్పడింది. ఆఫీసులు, స్కూళ్లనుంచి ఇళ్ల వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
బుధవారం (ఆగస్టు12) సాయంత్రం సిటీలోని హిమాయత్ నగర్,నారాయణగూడ,బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోని మణికొండ, పుప్పాలగూడ, అల్కాపూర్ టౌన్ షిప్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. సిటి నడిబొడ్డున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ , సెక్రటేరియట్ పరిసరాల్లో వాన దంచికొట్టింది.
మరోవైపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. మోండా మార్కెట్, క్లాక్ టవర్, రెజిమెంటల్ బజార్, ఎంజీ రోడ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లోకూడా వర్షం పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ ప్రాంతాల్లోకూడా వర్షం కురవడంతో పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద భారీ వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు తప్పలేదు.
