ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్, కొండాపూర్‌లోని ఎన్ఏ ఆర్ఏ జపాన్ హబ్ మధ్య భారత్– జపాన్ విద్యా సంస్కృతి, సంబంధాల బలోపేతానికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్, ఎన్ఏ ఆర్ఏ జపాన్ హబ్ వ్యవస్థాపకురాలు నాగనాథ్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధి, విద్య మార్పిడి, పరిశోధన, అంతర్జాతీయ విద్యా అనుసంధానం వంటి వాటిలో పరస్పర సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే జపనీస్ భాషా బోధన, ఇండో–జపాన్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పిస్తామన్నారు. శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు, వారసత్వ అంశాలపై సంయుక్త సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు విస్తరించనున్నాయని, భారత్–జపాన్ విద్యా సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూషన్స్ సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ యాదగిరి, నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ గంటి కృష్ణ శర్మ, ఎన్ఏఆర్ఏ జపాన్ హబ్ ప్రతినిధి శ్రీరామభద్రతోపాటు రెండు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
