ఐటీ ఉద్యోగులను ఒకేసారి బయటకు పంపొద్దు.. కార్ పూలింగ్ ప్రోత్సహించండి.. సిటీ పోలీస్ కీలక సూచనలు.

ఐటీ ఉద్యోగులను ఒకేసారి బయటకు పంపొద్దు.. కార్ పూలింగ్ ప్రోత్సహించండి.. సిటీ పోలీస్ కీలక సూచనలు.
  • ఐటీ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడాలి
  • సైబరాబాద్​ పోలీస్, మున్సిపల్ ​కమిషనర్లు 
  •     ఐటీ సంస్థలతో ఉన్నత  స్థాయి సమావేశం


గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో ట్రాఫిక్​ రద్దీ తగ్గించేందుకు ఉద్యోగులు కార్‌‌పూలింగ్‌‌ను ప్రోత్సహించడం, అలాగే మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులను ఎక్కువగా వినియోగించేలా ఐటీ సంస్థలు చర్యలు తీసుకోవాలని సైబరాబాద్​సీపీ డా.రమేశ్​సూచించారు. మన దగ్గర సుమారు10 లక్షల మంది పని చేస్తున్నారని, భారీ వర్షాలు కురిసే వేళ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఒకేసారి కాకుండా విడతల వారీగా లాగౌట్​ చేసేలా చూడాలన్నారు. 

వర్షాకాలంలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు సైబరాబాద్​ పరిధిలోని వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఇందులో సీపీతో పాటు సీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఆకస్మిక భారీ వర్షాలు వచ్చినప్పుడు వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో సైబరాబాద్ కన్వర్జెన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఐటీ కారిడార్ లో రోడ్లపై నిలిచిపోయే వాహనాలు, చెట్లు, ఇతర అవరోధాలను తొలగించేందుకు టోయింగ్ క్రేన్లు, వాటర్ పంపులు, ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ పెట్రోలింగ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వాతావరణ అప్‌‌డేట్స్, అత్యవసర అలర్ట్‌‌లను నేరుగా అందించేందుకు సైబరాబాద్ వెదర్ యాప్‌‌ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అసిస్టెంట్ సీఎంసీ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి,  అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ హనుమంత్ రావు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ నరేందర్, ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీఎస్సీ సీఈఓ నావెద్ పాల్గొన్నారు