పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వచ్చి.. రాజకీయం చేస్తామంటే కుదరదు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వచ్చి.. రాజకీయం చేస్తామంటే కుదరదు :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్​
  •     ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు..  యూనివర్శిటీల్లో ఉండడం వల్లే పేపర్ లీకేజీలు
  •     నీట్ అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వస్తే తమకు బాధ లేదని, కానీ ఇక్కడ రాజకీయం చేస్తామంటే కుదరదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్​అయ్యారు. కమలం పువ్వుకు ఉన్న రెక్కల్లో ఆయనో రెక్క అని ఎద్దేవా చేశారు. శుక్రవారం మహేశ్ గౌడ్ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై పీసీసీ చీఫ్​స్పందించారు. పవన్ హైదరాబాద్ కు వ్యక్తిగతంగా ఎన్నిసార్లయినా రావచ్చు, అవసరమైతే తాను వ్యక్తిగతంగా ఇంటికి పిలిచి భోజనం పెడతా, కానీ రాజకీయం కోసం వస్తానంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరెన్ని రాజకీయాలు చేసినా కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీలేదన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఆర్‌‌‌‌‌‌ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు యూనివర్శిటీల్లో ఉండడంతోనే ప్రశ్నా పత్రాలు లీక్ అవుతున్నాయని ఆరోపించారు. ఈ భావజాలం ఉన్న వ్యక్తులు యూనివర్శిటీల్లో దూరడం వల్లే విద్యావ్యవస్థ గతి తప్పిందని, వారితోనే సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే  నీట్ పరీక్షల నిర్వహణ వైఫల్యమైందని మండిపడ్డారు. యువత భావజాలం అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ వారి తరఫున పోరాటం చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. నీట్ అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.  

ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు..

హైదరాబాద్​లోని గాంధీ భవన్ లో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హాజరై భారీ కేక్​ కట్​చేసి పార్టీశ్రేణులకు పంచిపెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ నిర్వహించిన జాబ్ మేళాలో వంద కంపెనీలు పాల్గొని సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఉద్యోగాలు పొందిన వారికి మహేశ్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. పీసీసీ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంత్రి సీతక్కతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో భారీ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.