- అరుణాచల్ బార్డర్‌కు దగ్గర్లో.. చైనా భారీ డ్యామ్
- అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టిన డ్రాగన్ కంట్రీ ‘సియాంగ్ అప్పర్
- మల్టీపర్పస్ ప్రాజెక్ట్’ నిర్మించాలని భారత్ నిర్ణయం
గువాహటి: భారత్–చైనా సరిహద్దుల్లో జలయుద్ధం ముదురుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో.. టిబెట్‌లోని ‘యార్లంగ్ త్సాంగ్‌పో’ (బ్రహ్మపుత్ర) నది దిగువ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. బీజింగ్ పన్నిన ఈ రహస్య వ్యూహానికి గట్టి సమాధానం ఇచ్చేందుకు భారత్ కూడా అంతే వేగంగా పావులు కదుపుతోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్, సియాంగ్ జిల్లాల్లో ప్రవహించే సియాంగ్ నదిపై 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్’ (ఎస్‌యూఎంపీ) నిర్మించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్‌హెచ్‌పీసీ’ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయితే దేశంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌గా రికార్డు సృష్టిస్తుంది. దీని ద్వారా ఏడాదికి సుమారు 4,700 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.
మనకంటే చైనా స్పీడ్!
రెండు దేశాల ప్రాజెక్టులను పరిశీలిస్తే చైనా చాలా ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. చైనా నిర్మిస్తున్న ‘మెడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్’ సామర్థ్యం ఏకంగా 60 వేల మెగావాట్లు. దీని పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు, భారత ప్రతిపాదిత ఎస్‌యూఎంపీ ప్రాజెక్ట్ ఇంకా ప్రాథమిక పరిశీలన దశలోనే ఉంది. చైనా సామర్థ్యంతో పోలిస్తే మన ప్రాజెక్ట్ పరిమాణం చాలా తక్కువ. అయితే, ఈ ప్రాజెక్టును కరెంట్ ఉత్పత్తి కోసమే కాదు.. చైనా నీటిని మళ్లించినా లేదా అకస్మాత్తుగా వదిలినా తట్టుకునేలా, వరదలను నియంత్రించేలా డిజైన్ చేశారు. వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్ట్ భారత్‌కు ఎంతో కీలకం.
అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
టిబెట్‌లో ‘యార్లంగ్ త్సాంగ్‌పో’గా పిలిచే ఈ నదే.. భారతదేశంలోకి ‘సియాంగ్’గా ప్రవేశించి, ఆ తర్వాత ‘బ్రహ్మపుత్ర’గా మారి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు జీవనాడిగా నిలుస్తోంది. ఎగువన చైనా అంత భారీ డ్యామ్ నిర్మిస్తే.. దిగువన నీటి ప్రవాహం పూర్తిగా మారిపోతుంది. స్థానిక పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా, వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. అంతేకాకుండా, చైనా ఎప్పుడు పడితే అప్పుడు నీటిని విడుదల చేస్తే దిగువన ఊహించని రీతిలో మహా విపత్తులు, వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చైనా కదలికలపై భారత్ నిఘా ఉంచింది.
