భారతదేశం ఆధ్యాత్మిక దేశం. వేల సంవత్సరాలుగా దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు.. భక్తి, సంస్కృతి, సేవ, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలిచాయి. పేదవాడు అయినా, ధనవంతుడు అయినా దేవుని ముందు అందరూ సమానమే అనే భావన మన ఆధ్యాత్మిక సంప్రదాయానికి మూలం. నేడు అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సాధారణ భక్తుడి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది.
గంటల తరబడి క్యూలలో నిలబడే భక్తుడికి దర్శనం ఆలస్యమవుతుంటే, ఎక్కువ డబ్బు చెల్లించగలవారికి ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక దర్శనాలు లభించడం భక్తుల్లో అసంతృప్తిని పెంచుతోంది. భక్త రామదాసు ‘ఏ తీరుగా నను దయచూచెదవో రామ’ అంటూ దేవుడిని వేడుకున్న ఆవేదన నేటి సాధారణ భక్తుడి మనసులోనూ కనిపిస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లడానికి కూడా ఆర్థికస్థాయి అడ్డంకిగా మారితే భక్తి విలువ ఏమవుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ప్రత్యేక దర్శనాల వెనుక ఉద్దేశం ఏమిటి?
కొన్ని ఆలయాలు భక్తుల రద్దీ నియంత్రణ, నిర్వహణ ఖర్చులు, సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేక దర్శన విధానాలను ప్రవేశపెట్టాయి. సౌకర్యాల కోసం కొంత రుసుము తీసుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ అదే విధానం సాధారణ భక్తుడికి అవమానంగా, ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితిగా మారితే సమస్య మొదలవుతుంది.దైవ దర్శనం ఒక వ్యాపార సేవగా మారకూడదు. భక్తి కొనుగోలు చేసే వస్తువు కాదు. ప్రతి భక్తుడికి కనీస గౌరవంతో దర్శనం కల్పించే విధానం ఉండాలి. ప్రత్యేక దర్శనాలు ఉంటే కూడా సాధారణ భక్తుల దర్శన సమయాన్ని దెబ్బతీయకూడదు. భక్తుల సహాయ కేంద్రం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉండాలి.
దేవుడు ఎవరివాడు?
దేవుడు రాజులకో, కోటీశ్వరులకో మాత్రమే కాదు. చిన్ని కానుకతో వచ్చే పేద భక్తుడి కన్నీటి ప్రార్థనలో కూడా దేవుడు ఉంటాడని మన సంస్కృతి చెబుతుంది. ఆలయాలు భక్తి కేంద్రాలుగా ఉండాలి. ఆర్థిక అసమానతలు కనిపించే ప్రదేశాలుగా మారకూడదు. దేవుని సన్నిధిలో కనీసం అక్కడైనా ‘అందరూ సమానమే’ అనే భావన నిలబడాలి. అదే నిజమైన ఆధ్యాత్మికతకు గౌరవం.
- ఉక్కల్కర్ రాజేందర్ నాథ్
వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
