డిగ్రీ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం, మంచి జీతం వస్తుందనే నమ్మకం ఇప్పటికీ చాలా మంది యువతలో ఉంది. కానీ లేటెస్ట్ స్టడీ రిపోర్ట్స్ మాత్రం ఆ ఆశలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం 26 మంది మాత్రమే రెగ్యులర్ శాలరీడ్ ఉద్యోగాల్లో ఉన్నట్లు తేలింది. మిగిలిన వారు నిరుద్యోగం, స్వయం ఉపాధి, ఫ్యామిలీ బిజినెస్ నడపటం లేదంటే ఉద్యోగాల కోసం వెతుకుతున్న పరిస్థితిలో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.
100 మందిలో ఎవరు ఏం చేస్తున్నారు?
రిపోర్ట్ ప్రకారం ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో 26 మంది రెగ్యులర్ శాలరీడ్ ఉద్యోగాలు చేస్తున్నారు. 10 మంది స్వయం ఉపాధిపై ఆధారపడుతుండగా, 11 మంది కుటుంబ వ్యాపారాల్లో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నారు. మరో 3 మంది క్యాజువల్ వర్కర్లుగా లేదా ఫ్యామిలీ నడిపించే చిన్న వ్యాపారాల్లో పనిచేస్తున్నారు. 15 మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు కాగా, 35 మంది అసలు లేబర్ ఫోర్స్‌లోనే లేరు. అంటే చదువుకున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి కూడా స్థిరమైన జీతంతో కూడిన ఉద్యోగం లేవనే వాస్తవాన్ని లెక్కలు బయటపెట్టాయి.
జీతం వస్తున్నా.. నో జాబ్ సేఫ్టీ
రెగ్యులర్ శాలరీడ్ ఉద్యోగాలు చేస్తున్న 26 మందిలో కూడా పరిస్థితి సాఫీగా ఏం లేదు. వారిలోనూ కేవలం 4 మందికి మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్, చెల్లింపుతో కూడిన సెలవులు, సోషల్ సెక్యూరిటీ వంటి పూర్తి ప్రయోజనాలు ఉన్నాయి. మిగిలిన 22 మంది ఈ సౌకర్యాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లేకుండానే పనిచేస్తున్నారు. అంటే జీతం వచ్చే ఉద్యోగం ఉన్నా.. అది పూర్తిస్థాయి భద్రత కలిగిన ఉద్యోగం కాకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
మహిళలపై కుటుంబ బాధ్యతల ప్రభావం
లేబర్ ఫోర్స్‌కు దూరంగా ఉన్న 35 మంది గ్రాడ్యుయేట్లలో 20 మంది మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితమయ్యారు. మరో 14 మంది ఉన్నత విద్య కొనసాగిస్తుండగా.. ఒకరు వృత్తి శిక్షణ లేదా ఇతర కార్యకలాపాల్లో ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్న మహిళలు కూడా కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగాలకు దూరమవుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
సవాల్ ఉద్యోగాల సంఖ్య కాదు.. క్వాలిటీ కూడా
గత కొన్నేళ్లుగా భారత్‌లో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య భారీగానే పెరిగింది. ప్రతి ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్‌లోకి వస్తున్నారు. అయితే వారికి తగిన స్థిరమైన, భద్రత కలిగిన ఉద్యోగాలు మాత్రం అదే స్థాయిలో పెరగడం లేదు. ఉద్యోగాల సంఖ్య పెరగడమే కాకుండా.. కాంట్రాక్టులు, సోషల్ సెక్యూరిటీ, చెల్లింపుతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలు ఉన్న నాణ్యమైన ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం, పరిశ్రమలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. జాబ్ చేస్తున్న కొద్దిమందికి కూడా తగిన జాబ్ సెక్యూరిటీ, సేఫ్టీ దక్కటం లేదని సర్వే తేల్చేసింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రస్తుత ఏఐ యుగంలో జాబ్ మార్కెట్ పరిస్థితి ఇంత దారుణంగా కొనసాగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
