గేటెడ్ కమ్యూనిటీల్లో మెయింటెనెన్స్ తక్కువని కామన్ ఫెసిలిటీలు చిన్న ఫ్లాట్ ఓనర్లకు నిలిపేయెుచ్చా.. చట్టం ఏం చెబుతోంది?

గేటెడ్ కమ్యూనిటీల్లో మెయింటెనెన్స్ తక్కువని కామన్ ఫెసిలిటీలు చిన్న ఫ్లాట్ ఓనర్లకు నిలిపేయెుచ్చా.. చట్టం ఏం చెబుతోంది?

బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఓ 1BHK ఫ్లాట్ యజమాని ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీజు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ.. తనకు జిమ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్‌హౌస్ వంటి కామన్ సదుపాయాలు ఉపయోగించనివ్వడం లేదని ఆరోపించాడు. కారణం ఒక్కటే.. అతని ఫ్లాట్ చిన్నది కావడం. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్‌లలో కామన్ ఫెసిలిటీల వినియోగంపై పెద్ద చర్చ మొదలైంది.

ఫ్లాట్ పరిమాణాన్ని బట్టి మెయింటెనెన్స్ ఛార్జీలు మారడం సహజమే అంటున్నారు నిపుణులు. పెద్ద ఫ్లాట్‌లకు ఎక్కువ విస్తీర్ణం ఉండటంతో వాటిపై మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారని కొందరికి ఎక్కువ హక్కులు, తక్కువ చెల్లిస్తున్నారని మరికొందరికి తక్కువ హక్కులు అనే విధంగా వ్యవహరించడం చట్టబద్ధం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌస్, పార్కులు, పిల్లల ఆట స్థలాలు, లిఫ్ట్‌లు, సెక్యూరిటీ, అంతర్గత రోడ్లు వంటి కామన్ ఫెసిలిటీలు సాధారణంగా అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్ యజమానుల ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. అందువల్ల ఫ్లాట్ చిన్నదని, తక్కువ మెయింటెనెన్స్ చెల్లిస్తున్నారని చెప్పి ఎవరికైనా ఈ సౌకర్యాలు నిరాకరించడం చట్ట విరుద్ధమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సేఫ్టీ, నిర్వహణకు సంబంధించిన ఒకే విధమైన నిబంధనలు అందరికీ వర్తింపజేయవచ్చు.

ఒకవేళ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇలాంటి ఆంక్షలు విధిస్తే.. బాధితులు ముందుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే సివిల్ కోర్టుకు.. అవసరమైతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం వివక్షతో కూడుకున్నదని నిరూపించగలిగితే చట్టపరంగా సవాలు చేసే అవకాశం ఉంటుంది.

అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సదుపాయాలు ఇవ్వడం లేదనే కారణంతో మెయింటెనెన్స్ చెల్లింపులను నిలిపివేయకూడదు. అలా చేస్తే జరిమానాలు, వడ్డీలు, చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే మెయింటెనెన్స్‌ను క్రమం తప్పకుండా చెల్లిస్తూ.. మరోవైపు చట్టబద్ధమైన మార్గంలో న్యాయం కోసం పోరాడటం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.