రైతు డిక్లరేషన్‌‌కు కాంగ్రెస్‌‌ తిలోదకాలు : హరీశ్‌‌రావు

రైతు డిక్లరేషన్‌‌కు కాంగ్రెస్‌‌ తిలోదకాలు : హరీశ్‌‌రావు
  •     పంట కొనుగోళ్ల నుంచి తప్పించుకుంటున్న సర్కారు: హరీశ్‌‌రావు
  •     పేపర్‌‌ లెస్‌‌ కేబినెట్‌‌ కాదు.. ఫెయిత్‌‌ లెస్‌‌ కేబినెట్‌‌ అని ఎద్దేవా

సిద్దిపేట, వెలుగు: వరంగల్‌‌ రైతు డిక్లరేషన్‌‌కు కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ తిలోదకాలు ఇచ్చిందని సిద్దిపేట బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చివరి గింజ వరకు కొంటామని, రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు బోనస్‌‌ లేదు, పంటలు కొనం అని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. పంట కొనుగోళ్ల విషయంలో తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి మాటలను బట్టి... కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, నూనె గింజలు, కందులు, పెసర్లు కొనదని, వచ్చే వానాకాలం నుంచి వాటిని కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం చేతులెత్తేసినట్లేనని తెలుస్తోందన్నారు. బోనస్‌‌ ఇచ్చే విషయంలో 33 రకాల పంటల నుంచి 7 రకాలకు ఎందుకు కుదించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుభరోసా కింద రైతాంగానికి రూ.29,358 కోట్లు బాకీ పడిందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ రోజు వరకు 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు పడలేదో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ప్రీమియం కట్టకపోవడం వల్లే రైతులకు బీమా రావడం లేదన్నారు.