హైదరాబాద్, వెలుగు: బ్యాంకు రుణ బకాయిల పేరుతో తాకట్టు భూమిలో ఉన్న సమాధులను తొలగించాలని కోర్టును ఆశ్రయించడం పట్ల హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. జీవించి ఉన్నవారికే కాదు, మరణించినవారికీ గౌరవప్రదమైన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.
సమాధులను తరలించాలని న్యాయస్థానం ఎలా ఆదేశించగలదని ఐడీబీఐ బ్యాంకును ప్రశ్నించింది. హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని కొంత భూమిని తాకట్టు పెట్టి మెలాంజ్ క్లోతింగ్ లిమిటెడ్ తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పుడు అక్కడ సమాధులు ఉన్నాయని ఐడీబీఐ బ్యాంకు తెలిపింది. రూల్స్ ప్రకారం ఆ ప్రాంతానికి శ్మశానవాటిక హోదా లేదని, ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన సమాధులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.
