నేడు రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కొన్ని స్కూళ్లలో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష మధ్యలో వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు 2026 -27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి.
కొన్ని స్కూళ్లలో అయితే అప్పుడే అడ్మిషన్లు పూర్తయిపోయినట్లు చెబుతున్నారు. తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు అయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. నేడు తెలంగాణలో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు జలగల్లా పట్టి వారి రక్తాన్ని పీలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25 శాతం పేద పిల్లలకు కేటాయించాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకుంటున్న దాఖలా లేదు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కనిపించడంలేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్నా రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్నట్లులేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోవాలి.
-జూపల్లి దీపిక,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి (ఏబీవీపీ)
వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
