వైద్య సేవలు అస్తవ్యస్తం!భద్రాద్రికొత్తగూడెం జిల్లా పీహెచ్ సీల్లో దారుణంగా వైద్య సేవలు 

వైద్య సేవలు అస్తవ్యస్తం!భద్రాద్రికొత్తగూడెం జిల్లా పీహెచ్ సీల్లో దారుణంగా వైద్య సేవలు 

 

  •      నాణ్యమైన వైద్యానికి దూరంగా ఏజెన్సీ వాసులు 
  •      పీహెచ్​సీల్లో ఖాళీగా డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టులు 
  •      ఏఎన్​ఎంలతోనే కొనసాగుతున్న పలు పీహెచ్​సీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ కేంద్రాల్లో వైద్య సేవలు దారుణంగా మారాయి. డాక్టర్లు, స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో వైద్య సేవల భారం ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంలపై పడుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో ప్రసవం కోసం వచ్చిన ఓ ఆదివాసీ గర్భిణికి సరైన వైద్యం అందకపోవడంతో తల్లీబిడ్డలు మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ప్రసవ సమయంలో నిర్వహించిన మైనర్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో కడుపులో కత్తెర మిగిలిపోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

సగానికిపైగా ఖాళీలు..

జిల్లాలోని 29 పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలలో మొత్తం 65 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 24 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 59 మంది స్టాఫ్ నర్సుల పోస్టుల్లో 28 ఖాళీగా ఉన్నాయి. రామవరం, మణుగూరు, గుండాల తదితర పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలలో ఒక్క డాక్టర్ కూడా లేరు. జూలూరుపాడు, ఉల్వనూర్‌‌‌‌‌‌‌‌తో పాటు మరికొన్ని కేంద్రాల్లో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకుండా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 15 పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు 24 గంటల సేవల కోసం గుర్తించబడ్డాయి. నిబంధనల ప్రకారం ప్రతి కేంద్రంలో కనీసం ఇద్దరు డాక్టర్లు, నలుగురు స్టాఫ్ నర్సులు ఉండాలి. అయితే గుండాల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో ముగ్గురు డాక్టర్లకు గానూ ఒక్కరే ఉన్నారు. దమ్మపేట, గుమ్మడివల్లి, ఎర్రగుంట పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలలో డాక్టర్లే లేరు. 24 గంటల ఆస్పత్రులుగా ఉన్నప్పటికీ కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. డాక్టర్ల కొరత కారణంగా విధుల్లో ఉన్న వైద్యులపై పనిభారం పెరుగుతోంది. ముఖ్యంగా 24 గంటల ఆస్పత్రుల్లో ఒక్కరే డాక్టర్ ఉండటంతో పగలు సేవలందించినా రాత్రివేళల్లో అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది.

నాణ్యమైన వైద్యం కరువు.. 

గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ గర్భిణి వనజ ప్రసవం కోసం గత శనివారం గుండాల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీకి వెళ్లారు. ఆ సమయంలో డాక్టర్ ఫీల్డ్ డ్యూటీలో ఉండటంతో సీనియర్ ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎం ప్రసవం నిర్వహించారు. పుట్టిన శిశువు ఏడవకపోవడం, వనజకు అధిక రక్తస్రావం కావడంతో ఆమెను 60 కిలోమీటర్ల దూరంలోని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వనజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందారు. గురువారం వనజ కర్మకాండల సందర్భంగా కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించిన ప్రదేశంలో సర్జికల్​ కత్తెర కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఏఎన్ఎంలపైనే భారం.. 

డాక్టర్లు, స్టాఫ్ నర్సుల కొరత కారణంగా పలు పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలలో ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంలే ప్రధాన ఆధారంగా మారారు. తమ అనుభవం, పరిజ్ఞానంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు ప్రాథమిక వైద్య సేవలు 
అందిస్తున్నారు.

జోరుగా ఆర్ఎంపీల దందా.. 

జిల్లాలో అధిక భాగం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆదివాసీలు ప్రభుత్వ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలపైనే ఆధారపడుతున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సేవలు అందకపోవడంతో ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొందరు ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్లు, స్టాఫ్ నర్సుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల్లో మౌలిక వైద్య సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.