18 ఏళ్ల వయసు అంటే ఎంత..? ఇండియాలో ఓటు హక్కు వచ్చే వయసు. చదువు విషయానికి వస్తే ఇంటర్ పూర్తయ్యి.. డిగ్రీ ఫస్టియర్ లేదా సెకండియర్ చదువుకునే వయసు. కానీ ఆ వయసులో నాథన్ థామస్ అనే ఈ కుర్రాడు చాక్ పీస్ పట్టి స్టూడెంట్స్ కు పాఠాలు చెప్తున్నాడు. అతి చిన్న వయసులో ప్రొఫెసర్ గా నియామకం అయిన నాథన్ థామస్.. ప్రపంచ రికార్డును బ్రేక్ చేశారు. అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అయిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కాడు.
ఫ్లోరిడాకు చెందిన ఈ యువ టీన్ ప్రొఫెసర్.. 18 ఏళ్ల 346 రోజులకే ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి.. అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అయిన వ్యక్తిగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించాడు. 306 ఏండ్ల రికార్డును బద్ధలు కొట్టాడు ఈ కుర్ర ప్రొఫెసర్. మియామి డేడ్ కాలేజీ (Miami Dade College)లో ఇంజినీరింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాడు. 1717లో 19 ఏళ్లకే ప్రొఫెసర్ అయిన స్కాటిష్ మ్యాథమెటీషియన్ కొలిన్ మెక్లారిన్ రికార్డును బ్రేక్ చేశారు.
ఎలా సాధ్యం అయ్యింది..?
నాథన్ 10 సంవత్సరాల వయస్సులో పాఠశాల విద్యను కొనసాగిస్తూనే, డ్యూయల్-ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మయామి డేడ్ కాలేజీలో చేరాడు. 14 ఏళ్ల వయసు వచ్చేసరికి, ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ , మాస్టర్ డిగ్రీలు రెండింటినీ ఆనర్స్‌తో పూర్తి చేశాడు.
కొన్నాళ్త తర్వాత తాను ఒకప్పుడు విద్యార్థిగా ఉన్న అదే కళాశాలకు తిరిగి వచ్చాడు. అయితే ఈసారి స్టూడెంట్ గా కాదు.. ఒక ప్రొఫెసర్ గా రావడం ఆ స్కూల్ టీచర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆగష్టు 2023లో, ఇంజనీరింగ్ విద్యార్థులకు సి ప్రోగ్రామింగ్, కంప్యూటేషన్ (గణన) పరిష్కారాన్ని పరిచయం చేసే COP 2270: C ఫర్ ఇంజనీర్స్ అనే కోర్సును టీచ్ చేస్తున్నాడు.
జ్ఞానానికి వయసుతో పనిలేదు:
దాదాపు తన వయసులో ఉన్న విద్యార్థులకు బోధించడం నాథన్‌కు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదట. నేర్చుకోవడం అనేది వయస్సు మీద కాకుండా ఆసక్తి, పట్టుదల, మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం, మెరుగుపడటం, ఎదగటం అనే ఒకే కారణంతో క్లాస్ రూమ్ లోకి ప్రవేశిస్తారు కదా అని చెబుతున్నాడు.
ALSO READ : జుట్టు రాలడం టెన్షన్‌గా ఉందా? షాంపూలు, నూనె కాదు..
ఇంజనీర్ల కుటుంబంలో పెరగడం నాథన్ కు కలిసొచ్చిన అంశం. గణితాన్ని ఇష్టంగా నేర్చుకోవడం, చిన్న వయస్సు నుండే సైన్స్‌లో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. ముఖ్యంగా తన తల్లికి ఈ క్రెడిట్ ఇస్తానంటున్నాడు.
ఈరోజు ఇంజనీర్, రేపు లాయర్
నాథన్ ఆశయాలు ఇంజనీరింగ్ కే పరిమితం కాలేదు. అంతకు మించి ఆలోచిస్తున్నాడు. టీచింగ్ తో పాటు, అతను మయామి యూనివర్సిటీ లా స్కూల్ లో జూరిస్ డాక్టర్ డిగ్రీని చేస్తున్నాడు. 2028లో పట్టా పొందనున్నాడు. ఇంజనీరింగ్ ద్వారా తార్కిక ఆలోచనా నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు.. న్యాయశాస్త్రం చదవడంలో కూడా అంతే విలువైనవని నమ్ముతున్నట్లు చెప్పాడు.
