దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినట్టు అందరికీ తెలుసు. కానీ సంచార జాతి ప్రజలను ఆనాడు దొంగలుగానే గుర్తించేవారు. సంచార జాతి కులాల్లో పుట్టిన ప్రతి బిడ్డ (బై బర్త్ ) పుట్టుకతో దొంగలుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన చేసి దేశవ్యాప్తంగా అమలుచేసింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అనంతరం 1952లో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 81 ఏండ్లపాటు సంచార జాతి బిడ్డలు ఏ నేరం చేయకున్నా నేరస్థులుగా నేరంమోపి జైళ్లల్లో ఉంచి బాధించిన విషయాలు తెలుసుకున్నారు.
1952 ఆగస్టు 31న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న సంచార జాతి కులాల ప్రజలను నేరస్థులు కాదు విముక్త జాతులని ప్రకటించింది. అప్పటి నుంచి 1976 వరకు డినోటిపైడ్ ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ గా గుర్తించి ప్రత్యేకంగా విద్యారంగంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు డి.ఎన్.టి హాస్టల్స్ ఏర్పాటుచేసి నిర్వహించడం జరిగింది. అలా 1976 వరకు జరిగింది. కానీ దేశంలో వివిధ కమిషన్లు వేసి ఈ సంచార జాతి కులాలను వేరు వేరు జాబితాల్లో చేర్చి సంచార జాతి కులాల ఉనికిని లేకుండా చేశారు.
ఈ సమస్య పరిష్కారం కోసం 2006 నుంచి 2008 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బాలకృష్ణ రేణుకే కమిషన్, 2015 నుంచి 2018 వరకు భీకురామ్ ఇదాటే కమిషన్ వేసి ఈ రెండు కమిషన్స్ రిపోర్ట్స్ ఆధారంగా సంచార జాతుల సమస్యల సాధనకు కేంద్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉండాలని డి.ఎన్.టి డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సంచార జాతి కులాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి డి.ఎన్.టి పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని, డి.ఎన్.టి డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా 2021 నుంచి 2027 వరకు అమలు చేసేవిధంగా సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం కొన్ని పథకాలు ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. అదే సీడ్ పథకం.
డి.ఎన్.టి డెవలప్‌మెంట్ బోర్డు సేవలు
అర్హత ఉన్న విద్యార్థులకు వివిధ రకాల కోచింగ్‌లకు ఆర్థిక సహాయం రూ.120000 అందిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు అందిస్తారు. ఉచితంగా నైపుణ్య అభివృద్ధికి శిక్షణలు ఇస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెండానికి రుణ సహాయం అందిస్తారు. ఇల్లు లేని కుటుంబాలకు శాశ్వత ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేస్తారు. ఆ పథకాలు లబ్ధి పొందాలంటే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతి కులాలను గుర్తించి డి.ఎన్.టి పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తేనే ఆ సీడ్ పథకానికి అర్హులు.
ఈ విషయంపై గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అందువల్ల పథకంలోని కోట్ల రూపాయలు సంచార జాతులకు చెందకుండా పోయాయి. ఈ సమస్యను పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీంతో ఈ విషయంలో స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బి) సంక్షేమశాఖ తెలంగాణ రాష్ట్రంలో 51కులాలను గతంలో నేరస్తుల జాబితాలో తొలగించినవాటిని సంచార అర్ధ, సంచార కులాలుగా గుర్తిస్తూ ఆమోదం, నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వ జీవోలు
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య (G.O.Ms.No.) 10 తేదీ 12-–6-–2026 కింది వాటిని పరిశీలించడమైనది. విద్యా శాఖ వారి G.O.Ms.No.1793, తేదీ 23– 09–1970. వెనుకబడిన తరగతుల సంక్షేమ (OP) శాఖ వారి G.O.Ms.No.03, తేదీ 14– 08–2014. తెలంగాణ రాష్ట్ర వెను కబడిన తరగతుల కమిషన్ నివేదిక, తేదీ 30–01–2026. మంత్రివర్గ సమావేశ తీర్మానం సంఖ్య 599/2026, తేదీ 04–05–2026.
ఆదేశం ప్రకారం పైన పేర్కొన్న మొదటి G.O.లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జాబితాను మొదట రూపొందించి, వాటిని 'A', 'B', 'C', 'D',E' అనే ఐదు సమూహాలుగా వర్గీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, పైన పేర్కొన్న రెండవ G.O. ద్వారా ఆ ఎస్‌ఈబీసీల జాబితాను తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తింపజేస్తూ స్వీకరించారు. పైన పేర్కొన్న మూడవ అంశం (G.O.) ప్రకారం ప్రభుత్వం కోరిన మేరకు, తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్.. వ్యక్తులు, కుల సంఘాల నుంచి అందిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించింది.
బీసీ జాబితాలో గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఈబీసీలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిధిలో ఉన్న 51 కులాలను 'డీనోటిఫైడ్, సంచార అర్ధసంచార తెగలుగా కమిషన్ గుర్తించింది. ఈ 51 కులాలను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డీనోటిఫైడ్, సంచార అర్ధ, సంచార తెగలుగా నోటిఫై చేసి ప్రకటించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
ప్రభుత్వం పరిశీలన అనంతరం నోటిఫికేషన్ ద్వారా గెజిట్‌లో ప్రకటించింది. బీసీ జాబితాలోని గ్రూపు ఏ నుంచి 49 కులాలను, బీసీ ఈ గ్రూప్ లోని 2 కులాలను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డి,ఎన్,టి కులాలుగా గుర్తింపు ఇచ్చి సంచార జాతి కులాల చిరకాల కోరికను తీర్చడం సంతోషకర విషయం. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచార జాతి కులాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
- డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి,రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ సంచార జాతుల సంఘం
వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
