- ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆల్‌పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటు అతిపెద్ద ఆయుధమని, ప్రస్తుతం దాన్ని తొలగించే కుట్ర జరుగుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే వారిలో 80 లక్షల మంది వివరాలు లేకపోవడం కుట్రలో భాగమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు గళమెత్తాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన 'జీవించే హక్కును కాలరాస్తున్న ఎస్ఐఆర్' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవి, ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్‌తోపాటు వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ లౌకికవాద పార్టీలకు ఓటు వేస్తారన్న అనుమానంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాను కాపాడుకోవడంలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకమని, అందుకే కాంగ్రెస్ ఇప్పటికే 108 నియోజకవర్గాల్లో వీరికి శిక్షణ పూర్తి చేసిందని వెల్లడించారు. ఓటు హక్కు నిరూపణకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ధ్రువీకరణ పత్రాలపై కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రం అందజేయడంతోపాటు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
